టీడీపీ ఎమ్మెల్యేకు మలేషియాలో గాయాలు, సామాన్య ప్రజలకు అందుబాటులో బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు మలేషియాలో ప్రమాదానికి గురైంది. ఈ కారు ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయాలు కాగా, 12 కుట్లు పడ్డాయి. ఐదు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, కొందరు ఎమ్మెల్యేలు కలసి సింగపూర్, మలేషియాల పర్యటన నిమిత్తం వెళ్లారు.
అక్కడ ఎమ్మెల్యే బుచ్చిబాబు చైతన్య రాజు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఎమ్మెల్యే బుచ్చిబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు దెబ్బతింది. గాయపడిన బుచ్చిబాబును మిగిలిన ఎమ్మెల్యేలు స్ధానిక ఆసుపత్రికి తరలించి చికత్స అందించారు.
బుచ్చిబాబు విదేశాల్లో గాయపడినా.. ఆయన ఇక్కడకు ఇండియాకు తిరిగి వచ్చి తనకు ప్రమాదం జరిగినట్టు చెప్పే వరకు ఈ విషయం ఎవ్వరికి తెలియకపోవడం గమనార్హం. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతారన్న ఉద్దేశంతో, సంఘటనను దాచిపెట్టినట్లు తెలుస్తోంది.

స్వదేశానికి వచ్చిన తరువాత మాత్రమే కారు ప్రమాదం విషయం అందరికీ తెలిసింది. బుచ్చిబాబుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు బుచ్చిబాబుకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన్ను పరామర్శించారు.
సామాన్య ప్రజలకు అందుబాటులో చంద్రబాబు
ఇకపై సామాన్య ప్రజలకు సైతం ఏపీ సీఎం చంద్రబాబు అందుబాటులో ఉంటారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ విజయవాడ క్యాంపు కార్యాలయానికి వచ్చే సందర్శకులను చంద్రబాబు స్వయంగా కలుస్తారని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు క్యాంప్ ఆఫీస్ ఎదుట అధికారులు నోటీసులు పెట్టారు. సీఎంను కలవాలనుకున్న వారు పేర్లు నమోదు చేయించుకుని కలవవచ్చని ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే వినతిపత్రాలను సీఎం స్వయంగా తీసుకోనున్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసే అవకాశాలూ ఉన్నాయి.












Click it and Unblock the Notifications