కలెక్టరు ప్రభుత్వ పరువు తీస్తున్నారు:మండిపడిన పోలవరం ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌పై పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్ కాంటనేని భాస్కర్ ప్రభుత్వ పరువు తీస్తున్నారని ఎంఎల్‌ఎ మొడియం శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా కలెక్టర్ పై పలు ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది.
Recommended Video

దర్బగూడెంలో నిర్వాసితుల కోసం సేకరించిన భూముల్లో పంట విషయమై కలెక్టర్ కు ప్రజాప్రతినిధుల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. చేతికొచ్చిన పంటను పాడు చేయొద్దని జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణ, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, స్థానిక శాసనసభ్యుడినైన తానూ కోరినప్పటికీ కలెక్టర్ ఏకపక్ష నిర్ణయంతో పంటను ధ్వంసం చేశేసి ప్రభుత్వ పరువు తీశారని ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కలెక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం...సిఎంకు ఫిర్యాదు...
ఈ విషయమై కలెక్టర్ కాటంనేని భాస్కర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే పోలవరం నిర్వాసితుల కోసం జీలుగుమిల్లి మండలం దర్భగూడెం, చీమలవారిగూడెం, రౌతుగూడెం, పాకలగూడెం గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ భూమిలో సాగుచేసిన పొగాకు, మొక్కజొన్న పంటను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది.

పంటనష్టపోయిన కుటుంబాలకు...ఎమ్మెల్యే పరామర్శ...
ఈ క్రమంలో పంట నష్టపోయిన అలవాల రాము కుటుంబాన్ని ఎంఎల్‌ఎ గురువారం పరామర్శించారు. పార్టీ తరపున ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్వాసితులకు గృహనిర్మాణాలు, మోడల్ కాలనీ నిర్మాణాల్లో కలెక్టరు నిబంధనలు పాటించడం లేదన్నారు. గతేడాది జులైలో వేలేరుపాడు మండలానికి చెందిన నిర్వాసితులకు ప్రస్తుతం దర్భగూడెంలో పంట సాగుచేసిన భూములను సాగు భూములుగా పంపిణీ చేశారని తెలిపారు. అనంతరం అధికారుల రికార్డుల్లో ఆ భూమిని మోడల్‌కాలనీ నిర్మాణాలకు మార్పుచేశారని చెప్పారు.

కలెక్టర్ పై...ఎమ్మెల్యే ఆరోపణలు...
ఆ విషయం నిర్వాసితులకు తెలియ జేయకుండా, భూమికి భూమి చూపకుండా ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. ఆ భూముల్లో సాగు చేయొద్దని నిర్వాసితులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వల్లే సాగు చేశారని తెలిపారు. చేతికొచ్చిన పంటను కలెక్టరు దున్నించివేయడం వల్ల పార్టీ, ప్రభుత్వ పరువు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.

నిర్వాసితుల ఆగ్రహం...టిడిపి ఫ్లెక్సీలు చించివేత
పంటను దున్నేయడంపై దర్భగూడెంలో కౌలురైతులు, గ్రామస్తులు టిడిపిపై నిప్పులు చెరిగారు. గ్రామంలోని టిడిపి ఫ్లెక్సీలను చించేశారు. టిడిపి స్తూపం చుట్టూ కట్టెలు వేసి నిప్పంటించారు. పరామర్శించేందుకు గురువారం దర్బగూడెం వచ్చిన ఎంఎల్‌ఎపైనా కౌలు రైతులు మండిపడ్డారు. పంటను కాపాడలేకపోయిన నాయకులు ఎందుకంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications