Kolikapudi Srinivas: కొలికపూడి మరో వాట్సాప్ రచ్చ..! ఈసారి వైసీపీకి ఆహ్వానం..!
ఏపీలో నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్న అతికొద్ది మంది రాజకీయ నేతల్లో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (kolikapudi srinivas) కూడా ఒకరు. గతంలో అమరావతి ఉద్యమంలో చురుగ్గా పనిచేసి టీడీపీ వద్ద మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా తొలిసారి ఎమ్మెల్యే సీటు కూడా సంపాదించుకున్న కొలికపూడి ఆ తర్వాత మాత్రం నిత్యం వివాదాలతో సావాసం చేస్తూనే ఉన్నారు. వీటిపై సొంత పార్టీ టీడీపీ అధిష్టానం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆయన మాత్రం అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తోంది.
గతంలో పలుమార్లు సొంత పార్టీలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన నేతలపై వాట్సాప్ స్టేటస్ లు పెట్టి వివాదాల్లో చిక్కుకున్న కొలికపూడి శ్రీనివాస్ ఈ విషయంలో అధిష్టానానికి వివరణలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మరోసారి వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఇందులో ఆయన విపక్ష వైఎస్సార్సీపీకి ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లు ఉంది. దీంతో కొలికపూడి మనసులో ఏముందో తెలియక సొంత పార్టీ నేతలు తికమక పడుతున్నారు.

ఇంతకీ ఆ వాట్సాప్ స్టేటస్ ను కొలికపూడి ఎందుకు పెట్టారో తెలుసా ?, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇందులో పలు అంశాలపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. దీంతో బడ్జెట్ లోని సానుకూల అంశాల్ని జనంలోకి తీసుకెళ్లి చర్చ పెట్టాలని కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎవరికి వారు స్థానికంగా బడ్జెట్ పై రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు పెడుతున్నారు. అయితే ఇక్కడ కొలికపూడి చేసిందేంటే ఏకంగా విపక్ష వైసీపీతో పాటు ఇతర పార్టీల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. తద్వారా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications