ఏపీలో కూటమి రాకతో తెలంగాణలో రియల్ దెబ్బ ! రఘురామ లెక్క ఇదే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు.. తాజా ఎన్నికల్లో మాత్రం టీడీపీలో చేరి కూటమి ఎమ్మెల్యేగా ఉండి సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీలో జరుగుతున్న మార్పులను తెలంగాణతో పోలుస్తూ ఇవాళ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు రఘురామ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పొరుగున ఉన్న తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఊపు తగ్గిందని, ఇంకా చెప్పాలంటే స్తబ్దత నెలకొందని రఘురామరాజు ఇవాళ పేర్కొన్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రేట్లు 10 శాతం మేర తగ్గాయని కూడా రఘురామ తెలిపారు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడమే అని ఆయన విశ్లేషించారు.

అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకుందని రఘురామ వెల్లడించారు. ఇప్పుడు అమరావతిలో గజం 40 వేలు పలుకుతోందన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం వచ్చిందని, ముఖ్యంగా రాజధాని అమరావతే అని అందరికీ నమ్మకం కలిగిందని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో ఒక విజన్ ఉందని రఘురామ గుర్తుచేశారు. అందుకే ఇక్కడి రియల్ ధరలు పెరుగుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే తెలిపారు.
మరోవైపు అమరావతిలో తాజాగా జరిగిన కలెక్టర్ల భేటీపై స్పందిస్తూ.. కొందరు కలెక్టర్లు గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని గుర్తుచేశారు. కానీ ఐఏఎస్ కు పూర్వవైభవం తెచ్చేలా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఐఏఎస్‌లకు చంద్రబాబు గతంలో ఎక్కువ గౌరవం ఇచ్చే వారని, ఇప్పుడు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తామని కూడా చెప్పారన్నారు. అటు జగన్ మాత్రం తన ఎమ్మెల్యేలను గతంలో పట్టించుకోలేదని, అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయ్యిందన్నారు. జగన్ కు ప్రజల నుంచి ఎలాంటి ముప్పు లేదని, ఆయన వల్లే గతంలో ప్రజలకు ముప్పు ఉండేదన్నారు.












Click it and Unblock the Notifications