కూటమి సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్..! త్వరలో కార్యకర్తలతో భేటీ- తాడోపేడో..!
ఏపీలో కూటమి సర్కార్ పై టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda VenkatRao) ఇవాళ ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలోని విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు (గన్నవరం ఎయిర్ పోర్టు ) టెర్మినల్ కాంట్రాక్టును తన రాజకీయ ప్రత్యర్దుల కోసం పనిచేసిన కంపెనీకి కట్టబెట్టడంపై ఆయన మండిపడ్డారు. నా రెక్కల కష్టం ఖర్చు చేస్తే, మీరు నన్ను అవమానాల పాలు చేస్తారా..అంటూ ఆయన ప్రశ్నించారు. గన్నవరంలో తన హక్కుల విషయంలో రాజీపడనని, ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే సహించనని యార్లగడ్డ తేల్చిచెప్పేశారు.
ఎన్నికల ముందు వచ్చినవాడు ముఖ్యమా..? అధికారంలోకి వచ్చాక వచ్చినవాడు ముఖ్యమా..?' అంటూ కూటమి నేతల్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. కేఎంవీ సంస్థకు ఎయిర్ పోర్టు టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే నాకిచ్చే గిఫ్ట్ ఇదేనా అని అడిగారు. ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు..ఇది క్షమార్హం కాదు అన్నారు. తన నియోజకవర్గంలో అవినీతి జరిగితే కచ్చితంగా ఎండగడతా .. ఎవరినీ ఉపేక్షించనన్నారు.

తనను ఏరోజూ కలవని వారు ఈ రోజు టీడీపీ అని చెప్పుకుంటున్నారని యార్లగడ్డ ఫైర్ అయ్యారు. కోటి , రెండు కోట్ల విరాళాలు ఇచ్చి పనులు చేయించుకునే వారికి చరమగీతం పాడాలన్నారు. గన్నవరంలో తన హక్కుల విషయంలో రాజీ పడనని తేలిచెప్పారు.ప్రోటోకాల్ పరంగా తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఊరుకునేది లేదన్నారు. త్వరలో కార్యకర్తల మీటింగ్ పెడతానని, ఆరోజు అన్నీ మాట్లాడతానని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కూటమిలో కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications