కాంగ్రెస్ ఇంచార్జ్ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు... లక్ష్మీనారాయణ దారుణ హత్య వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గుంతకల్ నుంచి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు. మొదట లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్‌తో ఢీ కొట్టి.. ఆ తర్వాత కారులో చిక్కుకున్న వారిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
అయితే తీవ్రగాయాలైన లక్ష్మీనారాయణను వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతే కాకుండా ఈ ఘటనలో జరిగేటప్పుడు కారులో ఉన్న ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గత నెల 27వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే వారిలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ కూడా అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది.

తీగ లాగితే డొంక కదిలింది..
లక్ష్మీనారాయణ హత్యకేసులో గుంతకల్ కి చెందిన గౌసియా అనే మహిళతోపాటు మరికొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. గౌసియా ఇచ్చిన సమాచారంతోనే గుమ్మనూరు నారాయణను కూడా అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన టిప్పర్ కొనుగోలుకు నారాయణ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసినట్టు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. అంతే కాకుండా హత్య జరిగిన తర్వాత కూడా మరో లక్ష రూపాయలు ఇచ్చారని వివరించారు.
ఈ క్రమం లోనే ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్టు స్పష్టం చేశారు. అలానే గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీని సైతం స్వాధీనం చేసుకున్నారు. దీంతో గుమ్మనూరు జయరాంపై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తనపై, తన తమ్ముడిపై వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయాలని.. తప్పు ఉంటే సరిదిద్దుకుంటా కానీ లేదంటే తాటతీస్తా అంటూ మీడియా ప్రతినిధులు హెచ్చరించారు. రైలు పట్టాలపై పడుకోబెడతానని వారిని ఆయన హెచ్చరించారు. దాంతో అప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ కావడంతో టీడీపీ అదిష్టానం సైతం సీరియస్ అయ్యింది.












Click it and Unblock the Notifications