Vizag: అడ్డం తిరిగిన టీడీపీ ఎమ్మెల్యేలు: చంద్రబాబుతో ఢీ: జగన్ నిర్ణయానికి సై: గంటా వెంట..!
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం, అమరావతి ప్రాంత రైతులు తీవ్ర వ్యతిరేకత, నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న వేళ.. విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని తాము స్వాగితిస్తున్నామని ప్రకటించారు.

ఉమ్మడి తీర్మానం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై తమ వైఖరిని తెలియజేయడానికి విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం అయ్యారు. టీడీపీఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పప్పల చలపతి రావు, పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్, రూరల్ ఆధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చడాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశారు.

గంటాకు మద్దతుగా..
ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు.. గంటా శ్రీనివాసరావుకు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తొలిరోజే గంటా శ్రీనివాసరావు దీనికి మద్దతుగా మాట్లాడారు. అప్పట్లో గంటా ప్రకటనను తప్పు పట్టిన వెలగపూడి రామకృష్ణ సైతం తన మనసును మార్చుకున్నారు. గంటాకు అనుకూలంగా స్పందించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చడాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో స్వాగతించాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

త్వరలో చంద్రబాబుతో..
తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానం రూపంలో పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. తమ వైఖరిని, క్షేత్రస్థాయిలో ప్రజల మనోభిప్రాయాలను చంద్రబాబుకు వివరించాలని తీర్మానించారు. అమరావతిలో రైతుల ఆందోళన తగ్గుముఖం పట్టిన వెంటనే చంద్రబాబుతో సమావేశం కావాలని వారు భావిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్లలేమని చంద్రబాబు వద్ద తేల్చి చెబుతామని, ఆ తరువాత ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ.. తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.

శ్రీకాకుళంలో మంట పెట్టిన కోండ్రు..
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం వారిని అనుసరించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే టీడీపీ నాయకుడు కోండ్రు మురళీ.. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను సమగ్రంగా, సమంగా అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం దోహద పడుతుందని, ఇందులో మరోమాటకు అవకాశమే లేదని కోండ్రు మురళి ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications