AP Assembly : జగన్ ఢిల్లీ టూర్ వివరాలకు టీడీపీ ఎమ్మెల్యేల పట్టు-మళ్లీ సస్పెన్షన్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ వివరాలు బయటపెట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ సమావేశాల్ని అడ్డుకోవడంతో మరోసారి గందరగోళం తప్పలేదు.
అమరావతి : ఏపీ అసెంబ్లీలో (AP Assembly) ఇవాళ కూడా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల ప్రారంభం నుంచీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేస్తూ.. సస్పెండ్ అవుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు (tdp mlas) ఇవాళ మరోసారి సస్పెండ్ అయ్యారు.
సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఢిల్లీ టూర్ కు వెళ్లి ఏం సాధించారో చెప్పాలని కోరుతూ ఇవాళ ఉదయం ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసనగా అసెంబ్లీకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు.. సభలోకి వచ్చాక కూడా ఇదే డిమాండ్ లేవనెత్తారు. జగన్ ఢిల్లీ టూర్ వివరాలు చెప్పాలంటూ సభా కార్యకలాపాల్ని అడ్డుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం స్పీకర్ ను కోరింది.

ఇవాళ సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేల్లో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ మంతెన, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి,బెందాళం అశోక్ ఉన్నారు. వీరందరినీ ఒక్క రోజు పాటు సస్పెండ్ చేయాలని శాసనసభావ్యవహారాలమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. దీంతో వీరందరినీ సభ నుంచి బయటకు పంపేశారు. అనంతరం సభా కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

మరోవైపు వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ లో భాగంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై ప్రధాని, హోంమంత్రికి జగన్ విజ్ఞప్తులు చేసినట్లు సీఎంవో చేసిన ప్రకటనపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వివేకా హత్య కేసులో చిక్కుతున్న సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రక్షించుకునేందుకే ఆయన ఢిల్లీలో లాబీయింగ్ చేసి వచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications