సంక్రాంతి నుంచే మహిళలకు ఫ్రీ బస్సు-టీడీపీ ఎంపీ శబరి వెల్లడి..!
ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుప్రయాణం కూడా ఒకటి. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆరునెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ అధికారులతో దీనిపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈ ఏడాది ఉగాది లోపు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో అధికారులు వివిధ రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలవుతున్న తీరును అధ్యయనం చేస్తున్నారు. ఆలోపే నంద్యాల టీడీపీ ఎంపీ, పార్లమెంట్ లో టీడీపీ ఉప నేత కూడా అయిన బైరెడ్డి శబరి ఇవాళ సోషల్ మీడియాలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కీలక పోస్టు పెట్టారు. ఇందులో ఆమె మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని సంక్రాంతి నుంచే అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో అధికార పార్టీ ఎంపీ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

ఇప్పటికే కర్నాటక, తెలంగాణ, ఢిల్లీలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఉగాది నుంచి అనుకున్న పథకం కాస్తా ముందుకు జరిపి సంక్రాంతి కల్లా అమలుకు ప్రభుత్వం సిద్దమైనట్లు బైరెడ్డి శబరి పోస్టుల్ని బట్టి తెలుస్తోంది. ఈ పథకం అమల్లో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా బైరెడ్డి శబరి తన పోస్టులో వెల్లడించారు. అలాగే ఆటో డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు శబరి తన పోస్టులో తెలిపారు.
సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. pic.twitter.com/2UCnMEHAdF
— Dr.Byreddy Shabari (@ByreddyShabari) January 2, 2025












Click it and Unblock the Notifications