విజయవాడ రైల్వే స్టేషన్ కు షాక్-లోక్ సభలో నిలదీసిన ఎంపీ చిన్ని..!
ఏపీలో కీలకమైన విజయవాడ రైల్వే స్టేషన్ కు కేంద్రం షాకిచ్చింది. అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసినా ఇప్పటివరకూ రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. దీనిపై ఇవాళ స్థానిక టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్రాన్ని లోక్ సభలో నిలదీశారు. లోక్ సభలో రైల్వేపై డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ కింద ప్రసంగించిన ఎంపి కేశినేని శివనాథ్ .. పెండింగ్ లో వున్న పలు రైల్వే సమస్యల అంశాలను ప్రశ్నించారు.
భారతదేశ రైల్వే ఆర్థిక వ్యవస్థకు ఆదాయం సమకూర్చటంలో విజయవాడ కీలక పాత్ర పోషిస్తుందని, విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణీకులకి సదుపాయాలు కల్పించేందుకు అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికైందని కేశినేని గుర్తుచేశారు. అత్యధిక ఆదాయం అందిస్తున్న విజయవాడ రైల్వేస్టేషన్ కి ఈ పథకం కింద గతమూడేళ్లుగా ఒక రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆరోపించారు.

విజయవాడలో పెండింగ్ లో వున్న రైల్వే సమస్యలను చిన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చారు. అలాగే ఈ రైల్వే బడ్జెట్ దేశ రైల్వే భవిష్యత్తుకు అనుకూలంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధత ప్రతిబింబిస్తుందన్నారు. విజయవాడలో సమీపంలోని పరిటాలలో మల్టీ-మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి రైల్వే లైన్‌ను ఆమోదించినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .
దేశంలోనే అత్యంత రద్దీగా వుంటే రైల్వే స్టేషన్స్ లో విజయవాడ స్టేషన్ ఒకటని, ఏటా 16.84 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుందని కేశినేని తెలిపారు. అమరావతి రాజధానిలో విజయవాడ రైల్వే స్టేషన్ ఒక భాగమని, అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే డివిజన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్ వరుసగా రెండు సంవత్సరాలుగా రూ.5,000 కోట్ల ఆదాయాన్ని అధిగమించిందని, అత్యధిక సరుకు రవాణా ద్వారా రూ.4,000 కోట్లు ఆదాయం రాబట్టింది. అయినా గత మూడేళ్లుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications