పార్టీ ఇంఛార్జ్ లు గొట్టాంగాళ్లు, అప్పుడే ఆఫర్లపై నిర్ణయం - కేశినేని నాని..!!
టీడీపీ ఎంపీ కేశినేని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంఛార్జ్ లు ఎవరు గొట్టాంగాళ్లు అంటూ సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేసారు. తనకు మహానాడుకు ఆహ్వానం లేదని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాను ఎందుకు కలిసారో తనకు తెలియదని..ఫోన్ చేసి రమ్మంటే వెళ్లాలనని వివరించారు. పార్టీలో ఇంఛార్జ్ లుగా ఉన్న గొట్టాంగాళ్ల కోసం పని చేయాల్సి వస్తోందన్నారు. పొమ్మనకుండా పొగు పెడుతున్నా రని..వంద శాతం కాలితే ఆఫర్ల గురించి నిర్ణయం తీసకుంటానని నాని స్పష్టం చేసారు.
కేశినేని మరోసారి : సొంత పార్టీ పై వరుస వ్యాఖ్యలతో ఎంపీ కేశినేని నాని విరుచుకుపడుతున్నారు. నందిగామ, మైలవరంలో వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పొల్గొని సొంత పార్టీ నేతల పైన కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలంగా మారాయి. దీని పైన పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసారు.

కేశినేని నాని టీడీపీలో ఆగ్రహంగా..అసౌకర్యంగా ఉన్నారని గ్రహించిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు మరోసారి కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో ప్లెబిసైట్ నిర్వహించాలన్నారు. అప్పుడు తన బలం ఏంటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీ అలైన్ మెంట్ లో భాగంగానే ఇంఛార్జ్ లను నియమిస్తారని..వాళ్లెవరు గొట్టాంగాళ్లు అంటూ వ్యాఖ్యానించారు.
సొంత పార్టీ నేతలే లక్ష్యంగా : మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు టార్గెట్ గా నాని ఈ ఘాటు వ్యాఖ్యలు చేసారని ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎంపీని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కేశినేని సమాధానంగా కామెంట్స్ చేసారని చెబుతున్నారు. తాను ప్రజలు ఎన్నుకున్న ఎంపీనని నాని చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రతినిధులు కూడా ఉన్నారని..కలిసి పని చేస్తే ప్రజలకు మంచిదని పేర్కొన్నారు. వేరే పార్టీల ఆఫర్లపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పొమ్మనకుండా పొగపెడుతున్నారని.. వంద శాతం మండితే అప్పుడు ఆఫర్లపైన నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెప్పారు. తాను మంచి వాడిననే తనకు అయోధ్య రామిరెడ్డి నుంచి ఆఫర్ వచ్చిందని నాని వ్యాఖ్యానించారు.

ఆహ్వానం అందలేదు : తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదని కేశినేని నాని స్పష్టం చేసారు. ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు ఒక్కరే మాట్లాడుతారని చెప్పారని వివరించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఆయన పీఏ ఫోన్ చేసి బాబు ఢిల్లీ వెళ్తున్నారు..రావాలని చెబితే వెళ్లానన్నారు. అమిత్ షాను ఎందుకు కలిసారో తనకు తెలియదని చెప్పారు.
తన పార్లమెంట్ పరిధిలోని గొట్టాం గాళ్ల కోసం కూడా తాను పని చేస్తున్నానని నాని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అవసరమైతే ప్రజలు తనను స్వతంత్ర అభ్యర్ధిగా గెలిపించుకుంటారనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. కేశినేని వ్యాఖ్యల ద్వారా ఆయన టీడీపీకి ఇక దూరం అయ్యేందు కే మానసికంగా సిద్దమైనట్లు కనిపిస్తోంది. మరి.. పార్టీ నాయకత్వం నాని విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications