చర్యలు తీసుకుంటారా - మీకే పంపిస్తా : అధ్యక్షుడికి ఎంపీ కేశినేని కౌంటర్..!!
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. టీడీపీ సీనియర్ ఎంపీగా ఉన్న కేశినేని నాని తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు ఎంపీ కేశినేని నానితో మంతనాలు జరిపారు. కృష్ణా జిల్లా..ప్రధానంగా విజయవాడ నగరంలోని కొందరు టీడీపీ నేతల తీరు పట్ల చాలా రోజులగా ఎంపీ కేశినేని ఆగ్రహంతో ఉన్నారు. దీంతో..అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ తన అసహనాన్ని ఎంపీ బయట పెడుతున్నారు.

కేశినేని నాని తాజా పోస్టింగ్ కలకలం
కొద్ది రోజులు పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చిన సమయంలోనూ స్వాగతం వేళ బొకే ఇచ్చే సమయంలోనూ అసహనం వ్యక్తి చేయటం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక, కృష్ణా జిల్లా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా.. కొందరు నేతలు తొడ గొట్టి కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామంటూ సవాల్ చేసారు. దీని పైనా కేశినేని నాని స్పందించారు. తొడలు కొట్టి..మీడియా లో మాట్లాడితే హీరోలు కాలేరని.. ప్రజల మధ్య రాజకీయం చేయాలని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటన సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా తన సొంత మనుషులనే సొంత పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారనేది కేశినేని ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. ఇక, ఇప్పుడు పార్టీ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కొన్ని వ్యాఖ్యలు చేసారు.

నాని ఇక డిసైడ్ అయిపోయినట్లేనా
పార్టీ అంతర్గత చర్చలు..సమీక్షల్లో జరిగిన సంబాషణలను వక్రీకరించి ప్రచారం చేసుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరువూరు సమీక్షకు సంబంధించి రఘురాం ఈ కామెంట్స్ చేసారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారి పైన చర్యలు ఉంటాయని రఘురాం హెచ్చరించారు. దీనికి సంబంధించి వార్త ఒక దిన పత్రికలో ప్రచురితం అయింది. దీనిని జత చేస్తూ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టారు. అందులో...సెటైరికల్ పోస్టు చేస్తూ..ఛ నిజంగా..క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్టు పంపిస్తాం రుజువులతో సహా చర్యలు తీసుకుంటారా మరి ..అంటూ కేశినేని ప్రశ్నించారు. ఈ పోస్టింగ్ ఇప్పుడు పొలిటికల్ సెక్షన్స్ లో వైరల్ అవుతోంది. ఇలా సొంత పార్టీ వ్యవహారాల పైన సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేయటం.. వ్యాఖ్యలు చేయటంతో అసలు కేశినేని నాని ఎన్నికల నాటికి ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కర చర్చకు దారి తీస్తోంది.

టీడీపీ నాయకత్వం ఏం చేయబోతోంది
గతంలో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సమయంలో కేశినేని నాని చేసిన ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. తనను కొన్ని రోజులు బీజేపీలోకి, కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకొని.. పార్టీని పటిష్టపరచుకొని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది..అంటూ కేశినేని నాని చేసిన పోస్టింగ్ కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక, ఇప్పుడు తాజా పోస్టింగ్ ద్వారా పార్టీలో ప్రతిష్ఠకు భంగం కలిగించే వారి పైన చర్యలు తీసుకోగలరా అనే విధంగా ప్రశ్నిస్తూ నాని ఈ పోస్టింగ్ చేసినట్లు స్పష్టం అవుతోంది. కేశినేని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే ఆలోచన లేదంటూ గతంలోనే ప్రచారం సాగింది. ఇలా..వరుసగా పార్టీలో పరిణామాల పైన నాని స్పందిస్తున్న తీరు..పలు చర్చలకు కారణమవుతోంది. దీంతో..ఇప్పుడు నాని వ్యవహారంలో పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications