చంద్రబాబు అరెస్ట్ పై కేంద్రానికి - రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ రోజు నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ప్రస్తావించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వైసీపీ తమ వాదనలతో సిద్దమైంది. తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు టీడీపీ ప్రయత్నం చేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమ కేసు గురించి కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ నుంచి ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ ఎంపీలు ప్రస్తావించారు.

చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు గురించి కూడా చెప్తుండగా, ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు అడ్డుతగిలారని అన్నారు. అయినా సరే రాజ్‌నాథ్ సింగ్ తమకు మాట్లాడే అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. వారిపై ఉన్న అవినీతి ముద్రను తమ నాయకుడిపై వేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ అంశంపై అఖిలపక్షంలోనే కాదు, పార్లమెంటు లోపల కూడా లేవనెత్తుతామని రాజ్యసభ సభ్యుడు కనక మేడల స్పష్టం చేసారు. విభజన చట్టం గడువు పూర్తవుతున్న అందులోని హామీల అమలు గురించి అడిగామని తెలిపారు. మహిళా బిల్లు గురించి కూడా ప్రస్తావించామని చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణ గురించి ప్రధాన మంత్రి గతంలో మాట్లాడారని, అందుకు తగిన మౌలిక వసతుల కల్పన చేయాలని అన్నారని గుర్తు చేశారు.
అంతకుముందు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జంతర్ మంతర్‌లో టీడీపీ శ్రేణులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో టీడీపీ ఎంపీలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ అంశంపై న్యాయపోరాటంతో పాటు ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగుతుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు. సొంత రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తామని రామ్మోహన్ నాయుడు వివరించారు.












Click it and Unblock the Notifications