పవన్ కళ్యాణ్ 'వ్యాపారం'పై టీడీపీ నేతల ఆగ్రహం, బాబుకు ఫిర్యాదు!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మద్దతిచ్చినంత మాత్రాన తీవ్రస్థాయిలో విమర్శలు చేయాలా? అని చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
సోమవారం నాటి ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ టీడీపీ ఎంపీల పేర్లు చెప్పుకుంటూ మరీ విమర్శలు గుప్పించారు. వ్యాపారాల కోసమే అయితే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఎవ్వరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.

పలువురు టీడీపీ ఎంపీల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే, ఇద్దరు బిజెపి ఎంపీలు గెలిచారని, వారి కూడా మాట్లాడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన టీడీపీ ఎంపీలు, నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టేందుకు తమకు అనుమతివ్వాలని పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కోరారని తెలుస్తోంది. చంద్రబాబు అనుమతిస్తే విలేకరులతో మాట్లాడుతామని చెప్పారని, అయితే జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు మాత్రం తాను వచ్చాక సమీక్షిస్తానని చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications