అధికారుల కోసం నిరీక్షణ: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుకు చేదు అనుభవం, హెచ్చరిక
పశ్చిమగోదావరి: పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు అధికారులెవరూ కనిపించలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అధికారులు వచ్చే వరకూ ఆఫీసులోనే నిరీక్షించారు.
వివరాల్లోకి వెళితే... గత రెండేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెళ్లారు. అయితే, కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు ఎవరూ కనిపించలేదు. వారంతా స్థానిక ఏఎంసీ కార్యాలయం వద్ద నరసాపురం ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు, వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మున్సిపల్ రివ్యూలో పాల్గొనేందుకు వెళ్లినట్లు తెలిసింది.

ఈ సమాచారంతో స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు మరింత ఆగ్రహానికి గురయ్యారు. అధికారులు వెంటనే రావాలని కబురు పంపారు. దీంతో అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కార్యక్రమాలకు వెళ్లిన అధికారులపై ఎమ్మెల్యే రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ధనాన్ని స్వప్రయోజనాలకు వినియోగించవద్దంటూ ఘాటుగా స్పందించారు. తాగునీరు, ఇళ్ల స్వాధీనం, డ్రైనేజీ వంటి మౌళిక సదుపాయాలు, అంబేద్కర్ భవన్, స్మశాన వాటిక, హెల్త్ పార్క్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, పార్క్ వంటి పనులు నెల రోజుల్లోగా పూర్తి చేయకపోతే ప్రజలు, మహిళలతో భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ప్రస్తుతం అధికారులు, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఈ పరిణామం జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications