నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
టీడీపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. మరి కొందరు టీడీపీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. నేతల మధ్య అధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఇక ఎన్నికలకు సంబంధించి గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. టీడీపీకి ఇప్పుడు రెబల్స్ భయం పట్టుకుంది. టీడీపీలో టికెట్ దక్కని నేతలు చాలమంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.
చాలా చోట్ల టీడీపీ రెబల్స్ రంగంలోకి దిగారు. దాదాపు 15 నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్స్ బరిలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.తాజాగా విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత బండారు సత్యనారాయణ పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన బహిరంగంగానే టీడీపీ అధిష్టానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో ఆయన వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు కూడా వచ్చాయి.

వెంటనే అప్రమత్తం అయిన చంద్రబాబు టీడీపీకి బండారు సత్యనారాయణ మాడుగుల టికెట్‌ను కేటాయించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. బండారు సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ,పైలా ప్రసాదరావు ఇద్దరు నాయకులు బండారు సత్యనారాయణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పని చేస్తున్నారు.
గురువారం మాడుగుల టీడీపీ అభ్యర్థిగా బరిలో బండారు సత్యనారాయణమూర్తి నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ,పైలా ప్రసాదరావులు సైతం నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు టీడీపీ నేతలు బరిలో ఉండటంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై తెలుగు తమ్ముళ్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతలతో మాట్లాడి సమస్యను తొలగించాలని క్యాడర్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. పైలా ప్రసాదరావు, గవిరెడ్డి రామానాయుడులను నామినేషన్లను విత్ డ్రా చేసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు












Click it and Unblock the Notifications