రగిలిపోతున్న అయ్యన్నపాత్రుడు - కిం కర్తవ్యం, దారెటు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పుతో కొందరు నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారు. టీడీపీ, జనసేనలో సీట్ల పంచాయితీ మొదలైంది. రెండు పార్టీల నుంచి అభ్యర్దులను అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, ఎవరికి ఎక్కడ సీటు ఇవ్వనుందీ సంకేతాలు ఇస్తున్నారు. దీంతో, తమకు..తమ వారసులకు సీట్లు ఆశించి రాదని డిసైడ్ అయిన వారు ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారుతోంది.
కుమారుడికి సీటు కోసం
టీడీపీలో సీట్ల ప్రకటనకు ముందు సమస్యలు మొదలయ్యాయి. సీనియర్లు తమ వారసులకు సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. గతంలోనే ఈ ప్రతిపాదన పార్టీ నాయకత్వం వద్ద చేసారు. నాడు సానుకూల స్పందన రావటంతో సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అనకాపల్లి సీటు మరొకరికి ఇవ్వాలనేది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అయ్యన్న లోలోపల రగిలిపోతున్నారు. తన కుమారుడు ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు తరహాలోనే మంచి వక్త అని అయ్యన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నో చెప్పిన నాయకత్వం
దీంతో నర్సీపట్నం నుంచి తన కుమారుడిని బరిలోకి దించే అవకాశం తెర మీదకు వచ్చింది. నియోజకవర్గంలో అయ్యన్నకు పరిస్థితులు అనుకూలంగా లేవు. అయ్యన్నపాత్రుడు వ్యవహార శైలి కారణంగా ఎక్కడా నియోజకవర్గంలో పట్టె పెరగలేదు.మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాద రహితుడు కావడంతో నియోజవర్గంలో మంచి పట్టు సాధించారు. అనకాపల్లి పార్లమెంట్ తన కుమారుడికి సేఫ్ సీటుగా.. తాను నర్సీపట్నం నుంచి పోటీ చేయాలని అయ్యన్న భావించారు. ఇప్పుడు తన సీటు తన కుమారుడికి ఇవ్వటం ద్వారా అయ్యన్నకు ఛాన్స్ ఉండదు . తన కుమారుడికి సీటు ఇచ్చినా గెలుస్తారనే నమ్మకం లేకపోవటంతో అయ్యన్న తర్జన భర్జన పడుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
అయ్యన్న వాట్ నెక్స్ట్
చంద్రబాబును ఈ మధ్య కాలంలో అయ్యన్న కలిసేందుకు ప్రయత్నిస్తే ఆపాయింట్మెంట్ దక్కలేదని పార్టీలో ప్రచారం సాగుతోంది. తునిలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే అయ్యన్న దానికి వెళ్ళలేదు. సీనియర్ నేతగా ఉన్న తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వకపోటం పైన అయ్యన్న పాత్రుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పూర్తిగా సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని..కుటుంబానికి ఒక్క సీటే ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు అయ్యన్నపాత్రుడు సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏంటి...దీనికి స్పందనగా అయ్యన్న పాత్రుడు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications