కడపలో ఆ కుర్చీ ఎంత పని చేసిందంటే ? వైసీపీకి భారీ షాక్ లు..!
రాజకీయాల్ల కుర్చీకి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. ఒకరు కుర్చీ ఎక్కాలన్నా, మరొకరు కుర్చీ దిగాలన్నా, ఒకరి కుర్చీ లాగాలన్నా ఎన్నో సమీకరణాలు ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తే ఏం జరుగుతుందో వైసీపీకి అర్ధం కావడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. తాజాగా కడప కార్పోరేషన్ లో చోటు చేసుకున్న ఓ ఘటన వైసీపీకి ఏకంగా 8 మంది కార్పోరేటర్లను దూరం చేస్తోంది. వీరంతా పార్టీ కీలక నేతల అనుచరులే, అలాగే వారు చెప్పినా వినకుండా వీరు టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ? తాజాగా కడప మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అయిన రెడ్డప్పగారి మాధవీరెడ్డి వచ్చారు. ఈ భేటీలో వేదికపై స్థానిక ఎమ్మెల్యేకు కుర్చీ వేసి గౌరవించాల్సి ఉండగా.. కార్పోరేషన్ లో పట్టున్న వైసీపీ ఆమెను లైట్ తీసుకుంది. దీంతో అక్కడే ఎమ్మెల్యే దీనిపై ఘాటుగా స్పందించారు. ఆ కౌన్సిల్ భేటీలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ కార్పోరేటర్లుగా రచ్చ రచ్చ జరిగింది. సీన్ కట్ చేస్తే 8 మంది వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
ఆరోజు టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వైసీపీ గౌరవంగా సీటు ఇచ్చేసి ఉంటే సరిపోయేది. కానీ వైసీపీ ఉద్దేశపూర్వకంగా ప్రతిష్టకు పోయింది. దాంతో టీడీపీ ఎమ్మెల్యే కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అంతే .. కార్పోరేషన్లో తమకు ఇద్దరు కార్పోరేటర్లే ఉండటంతో పరిస్ధితి ఇలా ఉందని గ్రహించారు. అలాగే వైసీపీలో అసంతృప్తులు ఎవరున్నారో గుర్తించారు. వారితో టచ్ లోకి వెళ్లి వచ్చే ఐదేళ్లూ అధికారంలో ఉన్న తనను నమ్మి పార్టీలోకి రావాలని కోరారు. దీంతో వారు కూడా సరేనన్నారు.
వీరంతా కడపలో గత ఐదేళ్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే అంజాత్ బాషాతో పాటు కడప మేయర్ సురేశ్ బాబు అనుచరులే. వీరిని వైసీపీని వీడకుండా ఆపేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు. అయినా వారు ఎవరి మాటా వినలేదు. టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నారు. ఇవాళ వీరంతా అధికారికంగా టీడీపీలో చేరిపోబోతున్నారు. అయితే దీని వల్ల వైసీపీకి తక్షణం వచ్చిన నష్టమేమీ లేకపోయినా చిన్న కుర్చీ వివాదంతో 8 మంది కార్పోరేటర్లను కోల్పోతుండటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications