Teachers: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఫిక్స్...!!
Teachers transfers: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు.. పదోన్నతుల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. తాజాగా విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాల పైన చర్చించారు. అటు ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ వేళ.. ఖాళీల భర్తీ అంశం పైన ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బదిలీలు.. పదోన్నతుల ముహూర్తం ఖరారు చేసారు.
ఏపీలో ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని అనుసరించి వేసవి సెలవులు ఇచ్చే ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విద్యా శాఖ నిర్ణయించింది. విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. హైస్కూల్ ప్లస్‌ల్లోని ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవు లపై త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయని వెల్లడించారు.

రెగ్యులర్ పోస్టుల ఖాళీలు ఏర్పడే వరకూ క్లస్టర్ టీచర్లు అక్కడే కొనసాగుతారని, వారికి పాత స్టేషన్ పాయింట్లే వస్తాయని స్పష్టం చేశారు. బదిలీ పాయింట్లలో డెసిమల్స్ స్థాయిలో పాయింట్లు కేటాయిస్తామన్నారు. ఇకనుంచి ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. టీచర్లకు పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు ఇటీవల విడుదల చేశామని తెలిపారు. ఎస్జీటీలకు 30:70 నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పదోన్నతులు ఉంటాయని స్పష్టత ఇచ్చారు.
చర్చల్లో నిర్ణయం
కాగా, వచ్చే నెల మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం లోగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కొత్త పోస్టులపైన జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 16 వేలకు పైగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేసింది. రెండో విడత డీఎస్సీ పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇక, వార్షిక పరీక్షలు పూర్తయిన తరువాత ఉపాధ్యాయుల బదిలీలు.. పదోన్నతుల పైన అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తోంది. సన్నాహకాల్లో భాగంగా ఉపాధ్యాయ సంఘాల తో చర్చించి..వారి అభిప్రాయాలను సేకరించారు. దీంతో.. పరీక్షలు పూర్తయి.. తిరిగి పాఠశాలలు తెరిచే లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.












Click it and Unblock the Notifications