34 మంది తహసిల్దార్ల బదిలీలను నిలిపేసిన ఒక్క అగ్గిపుల్ల, దేవుడా....ఎంత పని జరిగింది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని, ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైళ్లు కాలి బూడిద అయిపోయాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు భారీ మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జా చేశారని, ఆ భూముల వివరాలు, ఆ ఫైళ్లు అన్నీ ఇదే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయని టీడీపీ నాయకులు అంటున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భూములు దాఖలు చేస్తూ గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వందల ఎకరాలకు సంబంధిత పత్రాలు కాలపోయాయి. పెద్దిరెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి కూడా వందల ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గంలోని భూములు వివరాలు మొత్తం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంనే ఉన్నాయి. మదనపల్లె-అనంతపురం జాతీయ రహదారి విస్తరణ కోసం చేపట్టిన పనుల భూసేకరణ సమయంలో ప్రభుత్వ భూములు చూపించిన పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, ఆయన అనుచరులు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల పరిహారం తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ రికార్డులు బయటపడకుండా చూడాలనే సబ్ కలెక్టర్ కార్యాయంలోని రికార్డులకు నిప్పంటించారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. ఇటీవల చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసిల్దార్లను బదిలీ చేశారు. సుమారు 34 మంది తహసిల్దార్లను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ తహసిల్దార్లు అందరూ రిలీవ్ అవుతున్న సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం, రికార్డులు కాలిపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగాన్ని రెండ్రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారని కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేయవద్దంటూ సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం జిల్లాలో 34మంది పొరుగు జిల్లాల తహసీల్దార్లకు రిలీవ్ ఆర్డర్లను కలెక్టర్ వెంకటేశ్వర్ నిలిపేశారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు ఆ 34 మంది తహసిల్దార్ల బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోతాయని అధికారులు అంటున్నారు. ఇక తహసీల్దార్ల బదిలీలు ఎపుడు ఉంటాయో అనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అలాగే 2019 నుంచి ఐదేళ్ల కాలంలో అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో వ్యవసాయ, ఇనాం, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై జిల్లా అధికారులను సీసీఎల్‌ఏ వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇప్పుడు మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లెలో గతంలో పని చేసిన తహసిల్దార్లను పిలిచి విచారణ జరిపే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద మదనపల్లె డివిజన్ పోలీసులకు ఇప్పుడు చేతినిండా పని దొరికినట్లు అయ్యింది. ఈ కేసులో ఎవరెవరు చిక్కుకుంటారో, కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెలుతుందో అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications