ఇంట్రెస్టింగ్: తెలంగాణ అసెంబ్లీలో వైఎస్సార్, జగన్ పేర్ల ప్రస్తావన..!!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు రసవత్తరంగా కొనసాగింది. సభలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసింది. రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలపై కేటీఆర్ సహా పలువురు మంత్రులు సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో శాంతి భధ్రతల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఐటీ సహా ఎన్నో భారీ పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రావడమే దీనికి నిదర్శనమని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వాటిని అణచివేస్తామనీ స్పష్టం చేశారు.

తెలంగాణలో పటిష్ఠమైన శాంతి భద్రతల సుస్థిర వ్యవస్థ ఉందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలు సైతం తెలంగాణలో ఉన్న సుస్థిర శాంతిభద్రతల వ్యవస్థను ప్రశంసిస్తోన్నాయని అన్నారు. ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం లా అండ్ ఆర్డర్ గురించి పట్టింపుల్లేవని, ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా కేటీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తన ప్రసంగంలో ప్రస్తావించారు. దిశ సంఘటన చోటు చేసుకున్న తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి జగన్.. ఏపీ అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిండు సభలో జగన్ సెల్యూట్ చేశారని అన్నారు.

ఇక్కడి శాంతిభద్రతల వ్యవస్థ గురించి మాత్రం భట్టి విక్రమార్క, రఘునందన్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మాత్రం అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉంటే.. వారికి ఏ మాత్రం పట్టింపు లేదని, ప్రభుత్వంపై ఏదో ఒకరకంగా బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.
ఈ క్రమంలో కేటీఆర్.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో కొందరు తెలంగాణకు మంచి పనులు చేశారని చెప్పారు. ప్రత్యేకించి- వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని అమలు చేశారని, అది లక్షలాదిమందికి ఉపయోగపడుతోందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో లేదని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications