కక్ష సాధింపే: చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ స్పీకర్ పోచారం ఏమన్నారంటే?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని అన్నారు.
చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో తెలపకపోవడం బాధాకరమని పోచారం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదని, రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని హితవు పలికారు. కాగా, కామారెడ్డి జిల్లా బీర్మూర్ మండలం సంభాపూర్, భైరాపూర్ గ్రామాల్లో పోచారం పర్యటించారు.

ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కాగా, సంభాపూర్ గ్రామ ప్రజలు వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Telangana Speaker Pocharam Srinivas Reddy condemns CBN’s arrest
— M9.NEWS (@M9Breaking) September 22, 2023
"అధికారం ఉంది కదా అని అరెస్ట్ చెయ్యడం, శిక్షించడం మంచి పద్ధతి కాదు"#ChandrababuArrest pic.twitter.com/eivZdJAlxD
చంద్రబాబుకు మద్దతుగా కొత్తగూడెంలో భారీ ర్యాలీ
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొత్తగూడెంలో టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాబు కోసం మేము సైతం అంటూ టీడీపీ కార్యకర్తలు, మహిళలు, సింగరేణి కార్మికులు ర్యాలీలో నినదించారు. విజనరీ నేతను జైల్లో పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ర్యాలీలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని అన్నారు. ఏపీ సీఎం జగన్ కక్ష పూరితంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిరాశే మిగులుతోంది.












Click it and Unblock the Notifications