ఏపీలో కొత్త ప్రభుత్వానికి రేవంత్ స్నేహహస్తం - తిరుమలలో కీలక వ్యాఖ్యలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఏపీ-తెలంగాణ సంబంధాలపై మాట్లాడారు. ఫైనల్ గా కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు ఇచ్చారు.
తిరుమలలో ఇవాళ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంను కలుస్తానని వెల్లడించారు. రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రేవంత్ తెలిపారు. అలాగే రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తద్వారా కొత్త ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు పంపారు. అలాగే తిరుమలలో తెలంగాణ తరపున సత్రం, కళ్యాణమండపం నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు.

వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్ జగన్ తో అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రేవంత్ ను కలిసారన్న కారణంతో పలువురు వైసీపీ నేతలకు జగన్ టికెట్లు నిరాకరించారు కూడా. దీంతో రేవంత్ - జగన్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది. మరోవైపు రేవంత్ మాజీ గురువు చంద్రబాబు ఈసారి రాష్ట్రంలో అధికారంలో వస్తారన్న జోస్యాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications