7 మండలాలు ఆంధ్రలో: 'పోలవరం'పై తెలంగాణ భగ్గు
హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపడంపై తెలంగాణ భగ్గుమంటోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రేపు (గురువారం) తెలంగాణ బందుకు పిలుపునిచ్చారు. బందుకు తెలంగాణలోని వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.
కెసిఆర్ భగ్గు
కెసిఆర్ పోలవరం ఆర్డినెన్స్ పైన భగ్గుమన్నారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ సరికాదని ఆయన ఖండించారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే ఊరుకునేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు.

ఆంధ్రా నేతల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వ్యాపార సంఘాలు బందుకు సహకరించాలని కోరారు. ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్ ఆమోదించవద్దని తాను రాష్ట్రపతిని కోరానని చెప్పారు.
సుప్రీంకు వెళ్తామని హరీష్ రావు
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపితే తాము సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామని హరీష్ రావు అన్నారు.
ఆగమేఘాల మీద ఎందుకు: ఈటెల
రేపటి తెలంగాణ బందును విజయవంతం చేయాలని ఈటెల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆగమేఘాల మీద ఆంధ్రాలో కలపడం దారుణమన్నారు. అందుకే బందుకు పిలుపునిచ్చామన్నారు. అన్ని సంస్థలు స్వచ్చంధంగా బందుకు మద్దతు తెలిపాయన్నారు.
సరికాదు: తుమ్మల, బాలసాని
పోలవరం ముంపు ప్రాంతాలను వేరే రాష్ట్రానికి తరలించాల్సిన అవసరం లేదని తుమ్మల, బాలసానిలు అన్నారు. ప్రజాకాంక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఖమ్మం జిల్లా ప్రజలు వ్యతిరేకం కాదని అయితే, డిజైన్ మార్చాలని కోరారు.












Click it and Unblock the Notifications