వైఎస్ వివేకా హత్యకేసులో అనూహ్య పరిణామం- మాజీ ఐఎఎస్ ఎంట్రీ..!!
అమరావతి/హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం.. దాఖలు చేసిన రిట్ పిటీషన్ విచారణకు రానుంది. దీన్ని తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయంలో రిజిస్ట్రీ చేసిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. త్వరలోనే దీన్ని మెయిన్ పిటీషన్ విచారణలోకి జోడించనున్నట్లు తెలుస్తోంది.

వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ.. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మార్చేసి రికార్డ్ చేశారనేది ఆయన ఆరోపణ. ఈ హత్య కేసులో 2023 ఏప్రిల్ 9వ తేదీన అజేయ కల్లం స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. స్టేట్‌మెంట్ తీసుకునే సమయంలో తాను చెప్పింది ఒకటైతే.. సీబీఐ దాన్ని పూర్తిగా మార్చివేసిందని, మరో రకంగా.. ఛార్జ్‌షీట్‌లో దాన్ని పొందుపరిచిందనేది అజేయ కల్లం వాదన.
అదే విషయాన్ని ఆయన ఈ రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్యకేసు.. ఎలాంటి వివక్ష, పక్షపాతానికి అవకాశం లేకుండా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐకి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలు సైతం మీడియాలో రావడం తనను ఆశ్చర్యపరిచిందని, దర్యాప్తు అంశాలు బయటికి ఎలా వచ్చాయనేది అర్థం కావట్లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు.

తన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించడం సరైంది కాదని, దీనిపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా అజేయ కల్లం ఇదివరకే తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని తాజాగా తెలంగాణ హైకోర్టు.. ఈ రిట్ పిటీషన్‌ను విచారణకు స్వీకరించడం.. ఈ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు తిరిగినట్టయింది.












Click it and Unblock the Notifications