వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దు-సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశం-అల్లుడే నేరస్తుడని లాయర్ వాదన..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ సీబీఐకి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సీబీఐ వరుసగా మూడోసారి ఆయన్ను ఇవాళ హైదరాబాద్ లో విచారణ జరుపుతోంది. అదే సమయంలో హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓవైపు తన పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు అనుసరిస్తున్న తీరు, లాయర్ ను కూడా అనుమతించకుండా, ఆడియో, వీడియో రికార్డింగ్ చేయకుండా విచారిస్తున్న తీరును తప్పుబడుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

అవినాష్ ను అరెస్టు చేయొద్దని సీబీఐకి ఆదేశం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు పిలిపిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయకుండా సీబీఐకి ఇవాళ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, కోర్టుకు మరిన్ని సీబీఐ మరిన్ని వివరాలు సమర్పించాల్సి ఉన్నందున తాత్కాలికంగా సోమవారం వరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తర్వాత ఆయన అరెస్టుపై నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో అవినాష్ కు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.

అల్లుడే నేరస్తుడన్న అవినాష్ ?
హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ సందర్ఫంగా ఇవాళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినాష్ పిటిషన్ లో సునీతారెడ్డి పేరు కూడా పేర్కొన్న నేపథ్యంలో తనను కూడా ఈ విచారణలో ఇంప్లీడ్ చేయాలంటూ సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆమె వాదన కూడా వినేందుకు హైకోర్టు సిద్ధమైంది. అయితే ఈ కేసులో తన వాదనలు వినిపించిన అవినాష్ లాయర్.. ఆయన అల్లుడే అసలు నేరస్తుడని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తన క్లయింట్ అవినాష్ కు వ్యతిరేకంగా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

అవినాష్ సీబీఐకిచ్చిన వాంగ్మూలం వెనక్కి ?
వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసు విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించిన సీబీఐ అధికారులు రెండు విచారణల్లో వాంగ్మూలం తీసుకున్నారు. అయితే దానిపై ఆయన సంతకాలు పెట్టలేదు. దీనికి కారణం సదరు వాంగ్మూలాల్ని సీబీఐ అధికారులు ఎడిట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇదే వాదన ఆయన హైకోర్టులోనూ వినిపించారు. అదే కారణంతో సదరు వాంగూల్మాల్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై హైకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలాగే అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడాన్ని అవినాష్ న్యాయవాది ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు తదుపరి విచారణలో వాదనలు చేపట్టనుంది.












Click it and Unblock the Notifications