సభ వాయిదా: పోడియం వద్దే తెలంగాణ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఎలాంటి చర్చ జరగకుండానే శాసన సభ, శాసన మండలి గురువారం వాయిదాపడ్డాయి. రెండో విడత సమావేశాలు జనవరి 3 నుండి 10వ తేదీ వరకు, మూడో విడత 16 నుండి 23వ తేదీ వరకు జరుగుతాయి. మొదటి విడత సమావేశాల్లో 5న, రెండో విడత సమావేశాల్లో 18, 19న సెలవు దినాలు ఉన్నాయి. జనవరిలో అసెంబ్లీ 13 రోజులు జరగనుంది.
సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. పోడియం ముందు వారు బైఠాయించారు. రాత్రంతా సభలోనే ఉండి దీక్ష చేసి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.

తెరాస దొంగనాటకాలు: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి దొంగనాటకాలు ఆడుతోందని ఎర్రబెల్లి దయాకర రావు గురువారం మండిపడ్డారు. కెసిఆర్ పార్టీని విలీనం చేయక పోవడం వల్లనే తెలంగాణపై కాంగ్రెసు నాటకాలాడుతోందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. చంద్రబాబును విమర్శించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారన్నారు.
రాష్ట్రపతిని కలుస్తాం: హరీష్
స్పీకర్ వైఖరి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు తెలంగాణలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. తెలంగాణపై చర్చను అడ్డుకుంటున్న విషయాన్ని తాము రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సీమాంధ్ర నేతలు రాజకీయ ప్రాబల్యం కోసమే చర్చను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చర్చను అడ్డుకున్నా తెలంగాణను ఆపలేరన్నారు.
కేంద్రానికి సీమాంధ్ర నేతల లేఖ
తెలంగాణ ముసాయిదా బిల్లు విధివిధానాలపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఆర్థిక నివేదితక తదితర అంశాలు బిల్లుతో పాటు అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications