'బాబు ఆడియో రికార్డ్‌లపై అనుమానాలు, కేసీఆర్ బెదిరింపులు'
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడివిగా చెబుతున్న టేపులు రేవంత్ రెడ్డి అరెస్టు అయిన సందర్భంలోనే ఎందుకు విడుదల చేయలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డిలు సోమవారం ప్రశ్నించారు.
చంద్రబాబువిగా చెబుతున్న వాయిస్ రికార్డుల పైన తమకు చాలా అనుమానాలున్నాయని చెప్పారు. టేపుల వ్యవహారం రేవంత్ అరెస్టు సమయంలోనే ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు. ఆ టేపులను విడుదల చేసింది ఎవరని ప్రశ్నించారు.

ఇరు రాష్ట్రాల మధ్య తెరాస ప్రభుత్వం వైరం పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు. చంద్రబాబు టేపులు తెరాస సృష్టి అని ఆరోపించారు. తెరాస మోసంతో అధికారంలోకి వచ్చిందని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారన్నారు.
ఆచార్య జయశంకర్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెట్టలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ చరిత్రను పాఠ్యపుస్తకాల నుండి తొలగిస్తామన్నారు. టీడీపీని, చంద్రబాబును ఎవరు ఏం చేయలేరన్నారు. కేసీఆర్ కేబినెట్లో అంటరానితనం పాటిస్తున్నారన్నారు.
కేసీఆర్ చౌకబారు రాజకీయం: నర్సారెడ్డి
కేసీఆర్ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 85 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications