జగన్ వ్యూహాన్ని.. రివర్స్ లో ప్రయోగిస్తున్న చంద్రబాబు!
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'అన్‌స్టాపబుల్ -2' షోకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ షో లో చంద్రబాబు ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడానికి దోహదం చేసిన అప్పటి పరిస్థితులను పూర్తిగా వివరించారు. ఇదే క్రమంలో తన స్నేహితుల గురించి కూడా చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్ తోనే స్నేహం
ఎప్పటికప్పుడు తనకు స్నేహితులు మారుతూ వచ్చారని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో బాగా స్నేహం చేసినట్లు చెప్పారు. ఇద్దరం కలిసి బాగా తిరిగేవారిమని, మంత్రులు, ఎమ్మెల్యేలుగా కూడా బాగా కలిసున్నామని, కలిసి ఢిల్లీకి కూడా కలిసే వెళ్లేవాళ్లమని వెల్లడించారు. అయితే తాను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తమ మధ్య రాజకీయ విభేదాలేకానీ వ్యక్తిగత విభేదాలు ఎన్నడూ రాలేదని చెప్పారు. 'అన్‌స్టాపబుల్ -2'షోలో పాల్గొనడానికి ముందు కూడా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో చంద్రబాబు వైఎస్ ప్రస్తావన తెస్తున్నారు.

వైఎస్ పై ప్రశంసలు
'అమరావతి వివాదాలు - వాస్తవాలు' పేరుతో విజయవాడలో జరిగిన పుస్తకావిష్కరణలో కూడా వైఎస్ పై బాబు ప్రశంసలు కురిపించారు. తన తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఏనాడూ తాను ప్రారంభించిన కార్యక్రమాలను ఆపేయాలనుకోలేదని, వాటిని కొనసాగించారని, కావాలంటే ఇక్కడే ఉన్న కన్నా లక్ష్మీనారాయణను అడగండి అన్నారు. షోతోపాటు పలు కార్యక్రమాల్లో వైఎస్ గురించి అనేక విషయాలను ప్రస్తావించడం వెనక రాజకీయ కారణాలు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.

ఎన్టీఆర్ కేంద్రంగా రాజకీయాలు!
ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ కేంద్రంగా టీడీపీ, వైసీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరికి వారుగా ఎన్టీఆర్ అంటే తమకు గౌరవమని చెబుతున్నాయి. వైసీపీ అయితే ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేసింది.చంద్రబాబునాయుడికన్నా తామే ఎక్కువగా గౌరవిస్తామని ముఖ్యమంత్రి జగన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీనిద్వారా ఎన్టీఆర్ అభిమానులను తమవైపు తిప్పుకోవచ్చనే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తోంది. ఇది గ్రహించిన చంద్రబాబు ఇదేరకమైన వ్యూహంతో వైసీపీని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వైఎస్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయన గొప్ప వ్యక్తి అని, ఆయన తనయుడు, సీఎం జగన్ తో వైఎస్ ను అసలు పోల్చలేమని చెబుతున్నారు.

ఎత్తుకు పై ఎత్తుతో రాజకీయ సమరం
ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడంద్వారా ఆయన అభిమానులను ఇబ్బందిపెట్టకుండా ఉండటంతో పాటు వారిని తమ వైపు తిప్పుకోవచ్చనే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తుండగా, వైఎస్ పేరును ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఇరుపార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ సమరాన్ని దివంగతులైన ఇరు నేతలు పై నుంచి మౌనంగా గమనిస్తున్నారనుకోవచ్చు.












Click it and Unblock the Notifications