తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న తెలుగుదేశం.. అభ్యర్థుల ఖరారు
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి ప్రవేశించబోతోంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏపీ కంటే తెలంగాణలోనే కార్యకర్తల బలం అధికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ విజయం సాధించలేకపోతోంది. ఏపీకి రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకం. ఇక్కడ విజయం సాధించి పార్టీ పట్టును నిరూపించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీకంటే ముందుగానే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనుండటంతో అక్కడ కూడా పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టి తెలుగుదేశం పార్టీ బలాన్ని చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు.

సెంటెమెంట్ రెచ్చగొడుతుండటంతో..
2014, 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసినప్పటికీ తక్కువ సీట్లకే పరిమితమైది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు సెంటిమెంట్ ను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోందని భావిస్తున్న టీడీపీ వెనక్కి తగ్గింది. ఈసారి తెలంగాణలో జరగబోయే ఎన్నికల కోసం టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. తెలంగాణలో కూడా పార్టీని పటిష్ఠపరుస్తానని బాబు ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు
కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడిగా వంచె శ్రీనివాస్ రెడ్డిని బాబు నియమించారు. ఈయనతోపాటు పలు శాసనసభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను కూడా ప్రకటించారు. అంబర్‌పేటకు రాగిపణి ప్రవీణ్ కుమార్ అలియాస్ బిల్డర్ ప్రవీణ్, కంటోన్మెంట్ కి గడ్డి పద్మావతి, జనగాంకి రామిని హరీశ్, సిరిసిల్లకు అవునురి దయాకర్‌రావును నియమిస్తూ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.

బలాన్ని విస్తరించే దిశగా..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో బలం ఉంది. దాన్ని పెంచుకోవడంతోపాటు శ్రేణులను ఉత్తేజితం చేయడానికి వరుసగా అభ్యర్థులను నియమించుకుంటూ వస్తున్నారని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జిలను నియమించడంద్వారా 2023లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉండేలా తెలంగాణ టీడీపీకి మెరుగులు దిద్దుతున్నారని భావించవచ్చు.












Click it and Unblock the Notifications