మోడీ కేబినెట్ నుంచి ఇద్దరు అవుట్ ? విస్తరణకు ముందే షాక్..!
ప్రధాని మోడీ త్వరలో కేంద్ర కేబినెట్ (Union Cabinet) విస్తరణ చేపట్టబోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కొత్త మంత్రుల్ని తీసుకుంటారని, అలాగే కేబినెట్లో ఉన్న వారిని సాగనంపుతారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల నుంచి మంత్రుల్ని తప్పించే అవకాశం కూడా ఉంది. అలాగే త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ ముందస్తు షాకిచ్చారు.
కేంద్ర మంత్రివర్గంలో రాజ్యసభ (Rajya sabha) నుంచి పలువురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇద్దరికి ఈసారి రాజ్యసభ సీట్లు కొనసాగించలేదు. పంజాబ్ కు చెందిన రవనీత్ సింగ్ బిట్టూ, కేరళకు చెందిన జార్జి కురియన్ కు ఈసారి టికెట్లు ఇవ్వలేదు. బీజేపీ తాజాగా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్ధుల జాబితాలో వీరి పేర్లు లేవు. దీంతో త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో వీరిని సాగనంపడం ఖాయమని తేలిపోయింది. జూన్ 21తో వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం ముగియబోతోంది. అనంతరం జరిగే కేబినెట్ విస్తరణలో వీరిని తప్పిస్తారు.

అయితే తాను త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టూ చెప్పుకొచ్చారు. అందుకే తనకు రాజ్యసభ సీటు పొడిగింపు ఇవ్వలేదని తెలిపారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జి కురియన్ కు మాత్రం అలా చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు తాజాగా ముగిశాయి. మరోవైపు బీజేపీకి చెందిన మరో ఇద్దరు కేంద్రమంత్రులు హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరిలకు రెండు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. హర్ష్ మల్హోత్రాను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా, పంకజ్ చౌదరిని యూపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. వీరిని కూడా కేబినెట్ విస్తరణలో తప్పించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications