తెలుగుదేశం పార్టీ జనసేనకు ఇవ్వాలనుకుంటున్న సీట్లు ..?
తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు కీలకమైనవి. అన్నివైపుల నుంచి ప్రత్యర్థులు పొంచివున్నతరుణంలో గెలుపు గుర్రం ఎక్కి పార్టీని సురక్షిత స్థానంలో ఉంచాలని అధినేత చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. అందుకనుగుణంగా అవసరమైన చోట తగ్గడంతోపాటు మొహమాటాలను కూడా విడిచిపెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలతోపాటు ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి కూడా ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇవ్వడంలేదని ఖరాఖండిగా చెప్పేయడమే నిదర్శనంగా చూపిస్తున్నారు.

పొత్తులపై సందిగ్ధత?
జనసేనతో పొత్తు విషయమై ఇరుపార్టీల మధ్య సందిగ్ధ వాతావరణం ఏర్పడినప్పటికీ జనసేనకు ఎన్ని సీట్లివ్వాలనే విషయమై బాబు స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. దాదాపుగా అదే ఖాయమవుతుందని పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెయ్యి నుంచి 2వేల లోపు ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన సీట్లే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో జనసేనకు చాలా నియోజకవర్గాల్లో 10వేల నుంచి రూ.30వేల వరకు ఓటింగ్ పోలైంది. పవన్ స్వయంగా పోటీచేసిన భీమవరం, గాజువాకలో 30 శాతం ఓటింగ్‌తో 58వేలకు పైగా ఓట్లు జనసేనకు పోలయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి ఈ లెక్కలను పరిశీలిస్తూ వస్తున్న చంద్రబాబు జనసేనతో పొత్తులతోనే వెళ్లాలనుకుంటున్నారని, ఎన్ని సీట్లు ఇవ్వలనేది కూడా నిర్ణయం తీసేసుకున్నారని చెబుతున్నారు.

దూకుడు రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్
గత ఎన్నికలను పరిశీలిస్తే జనసేకు ఆరుశాతం ఓటింగ్ నమోదైంది. టీడీపీ 39.26 శాతం ఓట్లు సాధించింది. గత ఎన్నికల్లో ఆరుశాతం సాధించినప్పటికీ ప్రస్తుతం జనసేనాని దూకుడైన రాజకీయంతో రోజురోజుకు బలపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేయడం, తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న జిల్లాపై దృష్టిసారించి సాధ్యమైనన్ని సీట్లు అక్కడే సాధించాలనే వ్యూహాన్ని అమలు చేయడం, 2019 ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాల్లో కూడా ఈసారి గెలుపు బావుటాను రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉన్నారు.

కింగ్ మేకర్ గా అవతరించాలని..
కింగ్ మేకర్ గా అవతరించాలనే ఆలోచన రావడంతోపాటు తన సొంత డబ్బులతో కౌలు రైతులకు నష్టపరిహారం కింద నగదు అందజేస్తుండటంలాంటివన్నీ జనసేన గ్రాఫ్ పెరగడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీని దించేయడానికి అవసరమైతే బీజేపీతో పొత్తును కూడా వదులకోవడానికి పవన్ సిద్ధపడటంవల్ల కొన్ని వర్గాలను దరిచేర్చుకునే వ్యూహంగా ఉందని, అది ఫలిస్తున్న దాఖలాలు కనపడుతున్నాయంటున్నారు.

పరిణామాలను పరిశీలిస్తున్న బాబు
చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు 40 సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఏ నియోజకవర్గమనేది స్పష్టత రానప్పటికీ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, శాతం సరిచూసుకుంటున్న బాబు జనసేనకు 40 సీట్లు అయితే గౌరవప్రదంగా ఉంటుందని భావిస్తున్నారని, ఈ మేరకు సంకేతాలను పంపించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇరు పార్టీలు పొత్తులతో పోటీచేసి కొన్ని జిల్లాలను క్లీన్ స్వీప్ చేయాలనే ప్రణాళికను చంద్రబాబు అమలు చేస్తున్నారని, అందుకే ప్రస్తుతానికి పొత్తులపై పార్టీ నేతలెవరినీ మాట్లాడవద్దని ఆదేశాలు జారీచేశారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ టీడీపీ ఇవ్వాలనుకుంటున్న సీట్ల సంఖ్యను పవన్ అంగీకరిస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దికాలం వేచిచూడక తప్పేలా లేదు.!!












Click it and Unblock the Notifications