వారణాశిలోని ఆ మసీదుకు ఏపీకి సంబంధం ఏమిటీ- తెలుగు బ్రాహ్మణుడి పేరు?
Gyanvapi Mosque: ఉత్తరప్రదేశ్ వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదుకు తెలుగు భాషకు లింక్ ఉందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని పడగొట్టి, మసీదు కట్టారంటూ హిందూ సంఘాలు సాక్ష్యాధారాలతో స్పష్టం చేస్తోన్న వేళ.. ఈ వ్యవహారం అనూహ్య మలుపు తీసుకుంది.
ఈ మసీదులోని గోడలపై తెలుగు శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం మూడు శాసనాలను తెలుగులో రాసి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.

పురావస్తు శాఖ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కే మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న ఈ మూడు శాసనాల గుర్తించింది. దీనిపై ఓ నివేదికను రూపొందించింది. ఈ శాసనాలు 12 నుంచి 17వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తోన్నారు. కాలక్రమేణా అవన్నీ ధ్వంసమైనట్లు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఈ మూడు శాసనాల్లో ఒకదాంట్లో నారాయణభట్లు, ఆయన కుమారుడు మల్లన్నభట్లు పేర్లు కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారణాశిలో వెలిసిన కాశీ విశ్వనాథుడి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ కోసం తెలుగు బ్రాహ్మణుడు నారాయణభట్లు 15వ శతాబ్దంలో ఆయన అక్కడికి వెళ్లారని ఈ శాసనాల్లో రాసి ఉంది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
1458 నుంచి 1505 మధ్యకాలంలో జౌన్‌పూర్‌ను పరిపాలించిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ హయాంలో కాశీ విశ్వనాథుడి ఆలయం కూల్చివేతకు గురి కాగా.. 1585లో దాన్ని జీర్ణోద్ధరించారు. రాజా తోడర్‌మల్ ఈ ఆలయాన్ని అప్పట్లో జీర్ణోద్ధరించారని, ఈ పనులను పర్యవేక్షించడానికి తెలుగు బ్రాహ్మణుడు నారాయణభట్లు కాశీకి వెళ్లి, అక్కడే నివసించినట్లు మునిరత్నం రెడ్డి వివరించారు.
తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ భాషలకు చెందిన లిపి, శాసనాలు కూడా జ్ఞాన్‌వాపి మసీదు గోడలపై ఉన్నాయని మునిరత్నం రెడ్డి వివరించారు. మరో శాసనంలో తమిళనాడుకు చెందిన నారాయణ రామన్ అనే బ్రాహ్మణుడి పేరు ఉన్నట్లు చెప్పారు. ఈ ఒక్క మసీదు ఆవరణలోనే మొత్తంగా 34 భాషల్లో వేర్వేరు శాసనాలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చామని అన్నారు.












Click it and Unblock the Notifications