సీఎంలు కేసీఆర్..జగన్ ఇద్దరూ ఆ విషయంలో ఒక్కటేనా..!?
బీజేపీ లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు ఏకం అవుతున్నాయి. ఎన్నికల రూట్‌మ్యాప్ రూపకల్పనకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. పలు పార్టీల నేతలు పాట్నా చేరుకున్నారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. విపక్ష కూటమిలో చేరేది లేదని మాయావతి స్పష్టం చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధుల తో బీజేపీ టార్గెట్ చేసేలా వ్యవ రచన చేస్తన్నారు. మరి..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.
బీజేపీ టార్గెట్ మీటింగ్ : వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారం దూరం చేయటమే విపక్షాల లక్ష్యంగా మారింది. ఇందుకోసం ఐక్య పోరాటానికి సిద్దమయ్యాయి. విపక్షాలు ఏకతాటి పైకి తీసుకొచ్చి ఎన్నికల బరిలో దిగేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ చొరవ తీసుకున్నారు. పాట్నాలో ఈ రోజు జరుగుతున్న సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, బెంగాల్, తమిళనాడు,

ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలు మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), హేమంత సోరెన్ (జేఎంఎం), సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ హాజరయ్యారు.
సమావేశానికి కేసీఆర్ దూరం : ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు తటస్థ వైఖరితో ఉన్నారు. బీజేపీ కి వ్యతిరేకమే అయినా కాంగ్రెస్ తో కలిసి వేదికలు పంచుకొనేందుకు సిద్దంగా లేరు. పార్లమెంట్ కంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు కేసీఆర్ కు కీలకం. వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ జాతీయ రాజకీయాల్లో బీజేపీ..కాంగ్రెస్ రెండు పార్టీలతోనూ సమ దూరం పాటించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల ఆధారంగా కేసీఆర్ వ్యూహం పైన స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

తొలి నుంచి అదే వైఖరి : ఏపీ సీఎం జగన్ వైఖరి స్పష్టంగా ఉంది. జగన్ పార్టీ ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు యూపీఏ, ఎన్డీఏలో చేరలేదు. రెండు కూటములను లీడ్ చేస్తున్న కాంగ్రెస్ ..బీజేపీలతో దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు రాజకీయంగా ఏ పార్టీతోనూ జగన్ కు పొత్తులు లేవు. వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్ గానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
కేంద్రంలో అంశాల వారీగా బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా నిలిచింది. రాజకీయంగా మాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశమే అయినా..కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు సీఎం జగన్ సిద్దంగా లేరు. దీంతో...రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరి బీజేపీ..కాంగ్రెస్ విషయంలో దాదాపు ఒక్కటిగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications