Nandus World: పోలీసుల నోటీసులకు నో రెస్పాన్స్.. ఐదు రాష్ట్రాల్లో బాధితులు!
పైకి కనిపిస్తే అచ్చమైన తెలుగుతనం.. యూట్యూబ్ తెరిస్తే లక్షలాది మంది ఫాలోవర్లు.. లండన్ లైఫ్ అంటూ సోషల్ మీడియాలో పెట్టే వీడియోలకు వేలల్లో లైకులు. ఇదీ సెలబ్రిటీ యూట్యూబర్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ లీడ్ చేస్తున్న లగ్జరీ లైఫ్. కానీ, ఈ గ్లామర్ ప్రపంచం వెనుక ఊహించని చీకటి కోణం దాగి ఉందనే వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. యూకే వీసాలు, ఉద్యోగాల పేరుతో ఈ దంపతులు భారీ వసూళ్లకు పాల్పడ్డారంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబర్‌లోనే కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ట్విస్టులతో కూడిన ఈ కథలోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే యువకుడికి లండన్‌లో చదువుకునే రోజుల్లో మధుకర్‌తో పరిచయం ఏర్పడింది. చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన శివ.. మళ్లీ యూకే వెళ్లి సెటిల్ అవ్వాలని భావించాడు. తన వీసా రెన్యువల్, భార్యకు 'సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్' (COS) తో పాటు అక్కడ మంచి ఉద్యోగం ఇప్పించాలంటూ మధుకర్‌ను సంప్రదించాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. తమకున్న 'డెస్టినీ కన్సల్టెన్సీ' ద్వారా పని ముగించేస్తామని నమ్మించిన మధుకర్.. గుంటూరులోని తన తండ్రి మోహన్‌రావుకు రూ. 15 లక్షలు చెల్లించాలని డీల్ మాట్లాడాడు. ఆ మాటలు నమ్మి శివ 2023లో వారు చెప్పిన రెండు అకౌంట్లలోకి అడిగినంత సొమ్మును బదిలీ చేశాడు.

నకిలీ సర్టిఫికెట్.. బయటపడ్డ అసలు గుట్టు!
డబ్బులు తీసుకున్న రెండు నెలల తర్వాత మధుకర్ నుంచి శివకు ఒక 'సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్' (COS) లెటర్ అందింది. అయితే, ఆ లెటర్ ఇచ్చిన 'అగార్డ్ సొల్యూషన్స్' కంపెనీపై శివకు ఎందుకో అనుమానం వచ్చింది. నేరుగా ఆ కంపెనీ యజమాని ఫైజల్‌ను సంప్రదించడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. "నేను కొన్నాళ్లు వేరే దేశంలో ఉన్నాను.. ఆ గ్యాప్‌లో నా పేరుతో మధుకర్ నీకు తప్పుడు లేఖ ఇచ్చి ఉండొచ్చు" అంటూ ఫైజల్ అసలు బాంబు పేల్చాడు. అంటే.. శివ చేతికి వచ్చింది నకిలీ సర్టిఫికెట్ అని తేలిపోయింది! మోసపోయానని గ్రహించిన బాధితుడు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా.. కేవలం రూ. 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. మధుకర్‌ను ఏ1గా, రమానందనను ఏ2గా, మోహన్‌రావును ఏ3గా చేర్చుతూ కేసు నమోదైంది.
దేశవ్యాప్తంగా బాధితులు.. క్వాష్ పిటిషన్ల పర్వం!
ఈ వ్యవహారంలో పోలీసుల నోటీసులకు ఈ దంపతుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. పైగా కేసును కొట్టేయాలంటూ (క్వాష్ చేయాలని) నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. అయితే, ఈ దంపతుల చేతిలో మోసపోయింది కేవలం శివ ఒక్కడే కాదనే టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బిహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎందరో బాధితులు ఉన్నారని.. ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.20 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెరపైకి యూట్యూబర్ వివరణ: అసలు నిజం ఏంటి?
ఈ సంచలన ఆరోపణలపై యూట్యూబర్ రమానందన తన ఛానల్ ద్వారా స్పందిస్తూ సరికొత్త కౌంటర్ ఇచ్చారు. ఈ కథలో మరో కోణాన్ని ఆమె ఆవిష్కరించారు. "మా కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. మా పేర్లు చెప్పుకుని కొందరు ఇండియాలో సొమ్ము చేసుకుంటున్నారు. నా పేరు మీద కానీ, నా భర్త పేరు మీద కానీ ఎలాంటి కంపెనీలు లేవు. ఇలాంటి నకిలీ ప్రచారాలతో అప్రమత్తంగా ఉండండి" అంటూ ఆమె బాధితులకే రివర్స్ వార్నింగ్ ఇచ్చారు.
మరి లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితుల ఆవేదన నిజమా? లేక సెలబ్రిటీ హోదా ఉన్న ఈ దంపతులను కావాలనే కొందరు టార్గెట్ చేశారా? ఈ వీసా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది తేలాలంటే పోలీస్ దర్యాప్తు ముగిసేవరకు వేచి చూడాల్సిందే!














Click it and Unblock the Notifications