తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఒక్కడి సొత్తు కాదు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని, తన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే బాధ్యత లోకేష్ ఒక్కడికే లేదని, పార్టీలోని యువనేతలందరికీ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ద ప్రింట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలూ చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు, ఇతర విషయాలకు సంబంధించి కూలంకుషంగా మాట్లాడారు. ప్రజా సమస్యలపై నేతల్లో రానురాను అవగాహన కొరవడుతుండటం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తరం మారుతున్నకొద్దీ ఆలోచనలు మారుతున్నాయి
తరం మారుతున్న కొద్దీ రాజకీయ నాయకుల వారసుల ఆలోచనా తీరు మారుతూ వస్తోందన్నారు. గతంలో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే నేతలు అర్థం చేసుకునేవారని, కానీ తరం మారుతున్న కొద్దీ వీటిని అర్థం చేసుకోవడంలో నేతలు తడబడుతున్నారన్నారు. సమస్యను అర్థం చేసుకునే విషయంలోనే అవగాహన కొరవడుతోందన్నారు. పార్టీ పగ్గాలు ఎవరైనా చేపట్టవచ్చని, తన కుమారుడిగా లోకేష్ ఒక్కడికే ఆ అర్హత లేదని, సామర్థ్యం కలిగిన యువనేతలందరికీ ఉందన్నారు.

ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం
పొత్తుల నిర్ణయం అనేది ఎన్నికల సమయంలోనే తీసుకుంటామన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశం దిగువస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల నుంచి జరుగుతుందన్నారు. పొత్తుల గురించి చర్చించడానికి ఇంకా చాలా సమయం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం కొనసాగడాన్ని కూడా వారు ఇష్టపడటంలేదన్నారు.

ఇప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వాలకు లేదు
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మూడు సంవత్సరాల్లో ఇంత వ్యతిరేకతను ఎదుర్కొనలేదన్నారు. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధివైపు మొగ్గుచూపుతారన్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీదే గెలుపు అని ఆయన స్పష్టం చేశారు. మహానాడుకు తరలివచ్చిన జనసందోహమే ఈ విషయాన్ని తెలియజేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications