పవన్ కళ్యాణ్‌కు ప్రశ్న, అవినీతి గురించి అడగడమే టిడిపిని బాధించింది.
విజయవాడ: అనంతపురం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వేర్వేరుగా స్పందించారు.
రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దానిని నిలదీయాల్సిందేనని కానీ అవినీతి గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం బాధాకరమని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
రాష్ట్రంలో అందరికీ ఏదో జరుగిపోతోందనే అపోహను కల్పించే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. అత్యంత సమర్థవంతమైన నాయకుడి చేతిలో రాష్ట్రం ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిపాలన సాగిస్తోందన్నారు.

ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వడం లేదని చెప్పారు. మంచి ప్యాకేజీ ఇస్తామని చెప్పారన్నారు. అలాగే హోదాతో సమానమైన రాయితీలు కల్పిస్తామని చెప్పారన్నారు. అలాంటప్పుడు తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. హోదా అనే పేరు లేకుండా దానికి సమానమైనవి ప్యాకేజీ ద్వారా ఇస్తే తప్పేమిటన్నారు. కేంద్రం సాయం వద్దనకుండా సహాయంలో లోటుపాట్లు ఉంటే పోరాటం చేసేందుకు టిడిపి సిద్ధమన్నారు.
పవన్ చెప్పిన అంశాలను సూచనగా స్వీకరిస్తామని చినరాజప్ప అన్నారు. మంచి పాలన అందించాలన్నదే ప్రభుత్వ ఏకైక ధ్యేయమన్నారు. పది రోజుల్లో తొమ్మిది లక్షల మందికిపైగా టిడిపి సభ్యత్వం నమోదు చేసుకున్నారని, సభ్యత్వ నమోదులో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. సభ్యత్వ నమోదులో రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో కృష్ణా జిల్లా, 4, 5 స్థానాల్లో ఉభయగోదావరి జిల్లాలు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications