జగన్ బలహీనపడ్డారని, తెరపైకి కిరణ్ రెడ్డి: చంద్రబాబు
హైదరాబాద్: సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బలహీనపడ్డారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి తెచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్సించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానం వ్యవహరించిన తీరుపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని గవర్నర్ తనకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కూడా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒక్క మాటా అనలేదని, అంతా టెన్ జన్‌పథ్ స్క్రిప్టు ప్రకారమే నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన విమర్సించారు.
ఏ రూల్ ప్రకారం హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగిస్తారని ఆయన అడిగారు. రాజ్యంగ సవరణలు అవసరం ఉన్న బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెట్టారని ఆయన అడిగారు. 371డిని ఎలా పరిష్కరిస్తారని ఆయన అడిగారు. కాంగ్రెసు గేమ్ ప్లాన్‌లో తాము విఫలమయ్యామని ఆయన అన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రసమితిని కలుపుకుని, సీమాంధ్రలో తన పార్టీని తుడిచిపెట్టుకునైనా సరే జగన్‌కు సీట్లు వచ్చేలా ప్రణాళిక రచించి కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో తనకు ఆరు నెలలు నిద్రపట్టలేదని, రాష్ట్ర విభజన అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరడానికి తాను దేశమంతా తిరిగి, వివిధ పార్టీల నాయకులను కలిశానని ఆయన చెప్పారు. 2008లో లేఖ ఇచ్చినప్పుడు కూడా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే తాను చెప్పినట్లు చంద్రబాబు అన్నారు. కాంగ్రెసుకు రాజకీయమే తప్ప సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.
లోకసభలో బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అత్యవసర పరిస్థితి వాతావరణం నెలకొందని, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారని, అన్నీ తెలిసి కూడా స్పీకర్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. జరిగిన సంఘటనలను చూస్తుంటే బాధేస్తోందని ఆయన అన్నారు. ప్రతిదాన్నీ కాంగ్రెసు తన ఇష్టప్రకారం చేసిందని ఆయన విమర్శించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి ఉంటే విద్వేషాలు ఏర్పడి ఉండేవి కావని ఆయన అన్నారు.
ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు పార్టీ కక్కుర్తి పడిందని ఆయన అన్నారు. ఇది పాకిస్తాన్ ఇండియా విభజన కాదని, మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని తాను సూచించానని ఆయన అన్నారు. తన మాటను జాతీయ పార్టీలు అర్థం చేసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోకసభలో యుద్ధ వాతారణం సృష్టించారని ఆయన అన్నారు. ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేశారని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications