మళ్లీ ఉద్రిక్తం: పోలీసులపై ఫైర్ బాల్స్, కాంగ్Xజగన్ పార్టీ
విజయనగరం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటి బొత్స సత్యనారాయణ ఇలాకా అయిన విజయనగరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి సద్దుమణిగినట్లుగా కనిపించినా ఆదివారం మధ్యాహ్నం మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులు పోలీసుల పైకి నిప్పు బంతులు రువ్వారు.
విజయనగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కొందరు ఆందోళనకారులు నిప్పు బంతులతో పోలీసుల పైకి దాడి చేసి తరిమేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, బిఐఎస్ఎఫ్ పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఆందోళనలు అదుపులోకి రావడం లేదు.

దీంతో సీమాంధ్ర జిల్లాలకు భారీగా పారామిలటరీ దళాలను పంపించనున్నారని తెలుస్తోంది. విజయనగరం జిల్లాకే పది కంపెనీల పారామిలటరీ దళాలను పంపించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బొత్స విభజనకు అనుకూలంగా ఉన్నారనే ఆగ్రహంతో ఉన్న సమైక్యవాదులు ఆయన ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా వెళ్తున్నారు.
గాజులరేగలో పోలీసులు నిరసనకారుల పైకి రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. వల్లివీధిలో అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. దివాకర్ ట్రావెల్స్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గీయులు దాడికి యత్నించారు. దీనిని కాంగ్రెసు కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
విద్యుత్ లేక నిలిచిన రైళ్లు
సమైక్య ప్రభావం విద్యుత్ పైన, రైళ్ల పైన పడుతోంది. విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో నిజాముద్దీన్, పినాకిని, జనశతాబ్ది తదితర ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల పైన ఉద్యమ ప్రభావం పడింది. దీంతో జనరేటర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడం వల్ల సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications