పొన్నూరులో ఉద్రిక్తత.. తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య తోపులాట
ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పొన్నూరుకు సమీపంలోని శేకూరు చెరువులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారంటూ కొద్దిరోజులుగా ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పొన్నూరు టీడీపీ ఇన్‌ఛార్జి, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర శేకూరు చెరువు వద్దక వెళ్లారు. ధూళిపాళ్ల నరేంద్రను చెరువు వద్దకు రాకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అడ్డగోలుగా మట్టితవ్వకాలు చేపట్టారంటూ వైసీపీ వర్గాలు.. లేదంటూ టీడీపీ వారు గొడవ పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొందరు నాయకులు కింద పడిపోయారు. మరికొందరివి చొక్కాలు చిరిగిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిన అదుపు చేశారు. వివాదానికి కారకులైనవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

శేకూరు, చేబ్రోలు సమీప ప్రాంతాల్లో నాణ్యమైన మట్టి లభిస్తుందని, ప్రభుత్వ అనుమతి లేకుండా, గనులశాఖ అనుమతి తీసుకోకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారంటూ ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. క్వారీల్లో కూడా ఇలాగే చేస్తున్నారని, అడుగుతుంటే ఎదురు కేసులు పెడుతున్నారని, అయినప్పటికీ భయపడేది లేదని నరేంద్ర అన్నారు. తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇరుపార్టీల అభిమానులు భారీసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారందరినీ చెదరగొట్టారు.