సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్‌వర్క్!
బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' సినిమా అండర్ వరల్డ్ మాఫియా డీ-కంపెనీలో తీవ్ర కలకలం రేపింది. పాకిస్థాన్ నుంచి మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ గ్యాంగ్.. ఈ సినిమా భారీ విజయం సాధించిన వెంటనే ముంబైలోని తమ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసినట్లు నిఘా వర్గాల ద్వారా సంచలన సమాచారం బయటకు వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రెండు భాగాలుగా వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో 'బడే సాహెబ్' అనే పాత్రను చూపించారు. మరణ శయ్యపై ఉన్న ఈ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికలను నూటికి నూరు శాతం పోలి ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. దావూద్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే తొందరలో డీ-కంపెనీ ఈ ముంబై ప్లాన్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది.
ముంబై వీధుల నుంచి కొత్త రిక్రూట్మెంట్ .. ఐఎస్ఐ హస్తం
ఈ సినిమా తెచ్చిన సెగతో సరికొత్త ఉగ్ర కుట్రకు పాల్పడటం కోసం డీ-కంపెనీ కొత్త సభ్యుల వేటను ప్రారంభించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలను చోటా షకీల్ గ్యాంగ్‌కు అప్పగించగా.. వీరికి ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇచ్చే బాధ్యతలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ ఉగ్ర కుట్రను ముంబైలో అమలు చేసే బాధ్యతను పాత షూటర్ మున్నా జింగాడాకు అప్పగించారు. అయితే రిక్రూట్ అయిన కొత్త సభ్యులకు అసలు కారణాన్ని చెప్పకుండా.. ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి, వారిని తప్పుదోవ పట్టించి మతం పేరుతో రెచ్చగొట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు
ఇటీవల ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో ఈ ఉగ్ర కుట్ర పూర్తిగా భగ్నమైంది. దీంతో పాకిస్తాన్ ఐఎస్ఐ, ముంబై అండర్ వరల్డ్ మధ్య ఉన్న బలమైన లింకులు మరోసారి బహిర్గతమయ్యాయి. అండర్ వరల్డ్ సామ్రాజ్యంల, వసూళ్ల దందాలో డీ-కంపెనీ ప్రాభవం రోజురోజుకూ క్షీణిస్తోందని, తమ ఉనికిని చాటుకునేందుకే వారు ఈ ఫ్రాంటిక్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
తిప్పికొట్టిన భారత ఏజెన్సీలు
ప్రస్తుతం అండర్ వరల్డ్‌లో పోయిన తమ ఇమేజ్‌ను తిరిగి తెచ్చుకోవడం కోసం.. ఇండియాలో ఏదైనా పెద్ద దాడికి పాల్పడటం లేదా ఒక ప్రముఖుడిని టార్గెట్ చేయాలని దావూద్ గ్యాంగ్, ఐఎస్ఐతో కలిసి ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ భారతీయ దర్యాప్తు, రక్షణ సంస్థలు అప్రమత్తంగా ఉండి, కీలకమైన నిందితులను సరైన సమయంలో అరెస్ట్ చేస్తూ పాక్ కుట్రలను వరుసగా తిప్పికొడుతున్నాయి.












Click it and Unblock the Notifications