టిడిపిలో చేరుతున్నా, బాబు పిలవాలి: టిజి, జగన్ పైనా
హైదరాబాద్/కర్నూలు: చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు తదితరులు కాంగ్రెసుకు గుడ్ బై చెప్పి టిడిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం టిజి కర్నూలులో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.
కార్యకర్తల అభీష్టం మేరకు తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపారు. ఎంపీగా పోటీచేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దూతలు తనను అడిగారన్నారు. కానీ ప్రజాసేవకు టిడిపియే అనుకూలమని కార్యకర్తలు చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో తనతో పోటీలో నిలవాలనుకునే ముగ్గురు నాయకులకు నేర చరిత్ర ఉందన్నారు, ఆ ముగ్గురు నాయకులకు పెళ్లిళ్లి చేసిన నేపథ్యం లేదన్నారు.

తాళిలు తెంపిన చరిత్రే ఉందన్నారు. టిడిపికి మతసంస్థ ముద్ర వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అసలైన లౌకికవాద పార్టీ టిడిపియే అన్నారు. టిడిపి హయాంలో శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చామన్నారు.
కాంగ్రెసు పార్టీలో కొనసాగలేని పరిస్థితిలో అన్ని పార్టీల నుండి తనకు పిలుపు వచ్చిందని, టిడిపియే ఉత్తమంగా భావించి చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. టిడిపిలో చేరేందుకు ప్రజలు పచ్చజెండా ఊపారని, ఇక చంద్రబాబు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ పార్టీలో చేరుతానన్నారు. గంటా, టిజి, ఏరాసు ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబును కలిసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications