గొంతు కోసుకుంటా, ఐతే ఉండను: టిజి, జంపింగ్ సిగ్నల్
కర్నూలు/హైదరాబాద్: కర్నూలును తన కంటే ఎవరు ఎక్కువ అభివృద్ధి చేయలేదని, తనకంటే ఎవరైనా ఎక్కువగా అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను గొంతు కోసుకుంటానని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం సవాల్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచితే తాను కాంగ్రెసు పార్టీని వీడనని స్పష్టం చేశారు. తద్వారా విభజన జరిగితే పార్టీ మారుతానని టిజి వెంకటేష్ సంకేతాలు ఇచ్చారు.
తన పైన బురద జల్లేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్యం కోసం తాను మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. సీమ హక్కుల కోసం సీమ హక్కుల వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. సమైక్యం గురించి తాను పోరాడిన విషయం అందరికీ తెలుసునన్నారు. బిల్లును తిప్పి పంపించడమే విభజన సమస్యకు పరిష్కారమన్నారు. పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి అసంపూర్తి బిల్లును కేంద్రం పంపించిందని ఆరోపించారు.

కాగా, టిజి వెంకటేష్ సహా పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు తదితరులు తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ అనంతరం టిడిపిలో చేరే అవకాశముంది. కిరణ్ కొత్త పార్టీ పెడితే కొందరు ఆ పార్టీలోకి వెళతారు.
కిరణ్‌తో గంటా భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి గంటా శ్రీనివాస రావు హైదరాబాదులో భేటీ అయ్యారు. భేటీ అనంతరం గంటా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభాపతికి ఇచ్చిన నోటీసు, రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థులు, అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు వ్యూహంపై చర్చించామని చెప్పారు.












Click it and Unblock the Notifications