TTD: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల ఏడుకొండల కింద ఉన్న తిరుపతి సమీపంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి.భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హైందవ సనాతన ధర్మంలో రాజసానికి, రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష సేవలు అందిస్తోంది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు తిరుచానూరుకు భారీ సంఖ్యలో రావడంతో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications