హర్ట్ చేశారు- అమిత్ షా ఆదుకుంటారు
Vijayasai Reddy: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేపట్టిన ఉద్యమానికి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వాలని భావించారా? అందుకే- ఈ భేటీకి పార్టీ తరఫున ఎంపీని సైతం పంపించారా?.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.

దీనికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాయి. దీనికి నాయకత్వాన్ని వహిస్తోన్నారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ భేటీపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. డీఎంకేకు అనుకూలంగా మాట్లాడారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి స్టాలిన్ చేస్తోన్న ప్రయత్నాలను ప్రశంసించారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందడంలో అర్థం ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో తాను ఆయా పార్టీలతో ఏకీభవిస్తోన్నానని చెప్పారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేయాలనుకోవడం సరికాదని, ఇది ఆందోళనకరమని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు దెబ్బతీసినట్టవుతుందని అన్నారు.
ఈ విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదుకుంటారనే ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. దక్షిణాదిన ఏ రాష్ట్రం కూడా లోక్‌సభ నియోజకవర్గాలను కోల్పోదని, సీట్ల సంఖ్యలో న్యాయమైన పెరుగుదల ఉంటుందని అమిత్ షా ఇదివరకే చెప్పారని గుర్తు చేశారు. ఇది- వాస్తవ రూపం దాల్చుతుందని అభిప్రాయపడ్డారు.
ఏపీలో 4.6, ఉత్తర ప్రదేశ్‌లో 14.7 శాతం మేర లోక్‌సభ సీట్లు ఉన్నాయని, ఇలాంటి అసమానత ఉండకూడదని సాయిరెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్ తరువాత ఏర్పడే కొత్త లోక్‌సభలో ఇప్పుడున్న అదే శాతాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏపీలో తగ్గించడం, యూపీలో పెంచడం సరికాదని చెప్పారు.
1/2: Agree with the concerns of all South Indian states that a delimitation based solely on population will hurt us. While the concerns are genuine, the statement by HM @AmitShah ji that no South Indian state will lose seats and that fair increase will take place is also…
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 23, 2025
కోట్లాదిమంది ప్రజలు తమ తమ రాష్ట్రాల వెలుపల కూడా నివసిస్తోన్నారని, అలాంటి పరిస్థితుల్లో జనాభా దామాషా ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన శాస్త్రీయబద్ధంగా జరగకపోవచ్చని చెప్పారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేసిన సూచనలు సరైనవేనని అన్నారు.












Click it and Unblock the Notifications