TTD: భక్తులకు సంతృప్తికర దర్శనం - మాడ వీధుల్లో మాస్టర్ ప్లాన్..!!
Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తుల గోవింద నామ స్మరణ మధ్య గరుడ సేవ ఘనంగా జరిగింది. శ్రీవారి గరుడ సేవ విజయవంతం చేయటంతో పాటుగా..టీటీడీ సిబ్బంది సమన్వయంతో భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించినట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసారు.
విజయవంతంగా
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవను టీటీడీ అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈఓ శ్యామల రావు తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభమైంది.

గోవింద నామ స్మరణ
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.గరుడ సేవ అయిపోయిందని ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండకూడదని, మిగిలిన వాహన సేవలకు కూడా కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమవుతాయని ఈవో చెప్పారు.

మాడ వీధుల్లో మాస్టర్ ప్లాన్
మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రత అధికంగా ఉందని, వచ్చే బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లోని భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా షెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి వాహన సేవను కూడా గరుడ సేవ లానే భావించి సేవలు అందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మరో వందేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాలరీ సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించి చర్యలు చేపడతామన్నారు. బ్రహ్మోత్సవాలకు అనుభవం ఉన్న శ్రీవారి సేవకులను తీసుకుంటే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications