పొత్తు బీజేపీతో- తిరిగేది కాంగ్రెస్ హెలికాప్టర్‌లో: భలేగుంది బాబూ
Chandrababu Naidu: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. అన్ని పార్టీలూ క్షేత్రస్థాయిలో తమ క్యాంపెయిన్‌ను ఉధృతం చేశాయి. రోడ్ షోలు, బహిరంగ సభలు, ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటోన్నాయి. జనంతో మమేకం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్రను నిర్వహిస్తోన్నారు. నేటికి అయిదో రోజుకు చేరుకుంది ఈ యాత్ర. ప్రస్తుతం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో సాగుతోంది. కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం మీదుగా ఈ జిల్లాలో అడుగు పెట్టారాయన. 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.

దీనికి ధీటుగా తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజా గళం పేరుతో జనంలోకి దూసుకెళ్తోన్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రొద్దుటూరు, మార్కాపురం సహా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలను నిర్వహించారు.
అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్- కాకినాడ జిల్లాలో తాను పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఆయన పిఠాపురంలో కలియతిరిగారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల ప్రచారానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
ఇదంతా ఒక ఎత్తయితే- చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాల కోసం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు హెలికాప్టర్లు, ఛాపర్లు వాడుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రచార కార్యక్రమాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి రాకపోకలు సాగించడానికి బెల్ 429 రకానికి చెందిన ఛాపర్లు వినియోగించుకుంటోన్నారు.
ఇవి- కేళాచంద్ర గ్రూప్‌కు చెందినవి. ఈ గ్రూప్ మరెవరిదో కాదు.. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ కంపెనీకి చెందినవి. బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉంటూ కాంగ్రెస్ నాయకుడి ఏవియేషన్ కంపెనీకి చెందిన ఛాపర్లను వాడుతోండటం రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఇవే ఛాపర్లు, హెలికాప్టర్లను ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు విసృతంగా వినియోగిస్తోన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ సైతం వాటినే వాడుతున్నారు. ఆ జాబితాలో బీజేపీ మిత్రపక్షం చీఫ్ చంద్రబాబు కూడా చేరడం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications