హమ్మయ్య, టీడీపీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల కేసు కొట్టేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు తమ్ముళ్లు, జనసేన, బీజేపీ కార్యకర్తలు చిందులు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు పార్టీల నాయకులు పండగ చేసుకున్నారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించడంతో ఏం చెయ్యాలో తెలీక వైసీపీ నాయకులు కూడా కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఊపిరి పీల్చుకున్నారు.

కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. తనను బెదిరించి తనపై అత్యాచారం చేశారంటూ తిరుపతి జిల్లాలోని కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇదే నెల ఐదవ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సత్యేవేడు ఎమ్మెల్యే కోటేని ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన తిరుపతిలోని బీమాస్ పారడైజ్ హోటల్లో జరిగిందని బాధితురాలు పోలీసులకు చెప్పడంతో ఆ హోటల్ చేరుకున్న పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే కోటేని ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని, మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్ పై మహిళ ఫిర్యాదు చేసిందని, ఇది హనీ ట్రాప్ అని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలపు తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అత్యాచారం సెక్షన్ నమోదు చెల్లదని, ఈ కేసును కొట్టేయాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. బాధితురాలి తరపున ఆమె న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఆ సమయంలో బాధితురాలు స్వయంగా హైకోర్టు హాజరయ్యింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్ పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని బాధితురాలు హైకోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు మనవి చేశారు.
బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హైకోర్టు సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన కేసును బుధవారం కొట్టివేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ నుండి సస్పెండ్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను కలిసి అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అత్యాచారం ఆరోపణల నుండి బయటపడడంతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని త్వరలో పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications