ఊపిరి పీల్చుకున్న సజ్జల, డీజీపీ, ఎస్పీకి హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోరాదని గతంలో ఇచ్చిన ఉత్వర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో నాలుగు వారాల పాటు పొడగించడంతో సజ్జల రామకృష్ణారెడ్డి తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్ ను హైకోర్టు విచారణ జరిపింది. సజ్జల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులు కారణంగా చూపి విదేశాల నుంచి వస్తున్న పిటీషనర్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎయిరో పోర్టులో నిర్బంధించారని పోన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుకు చెప్పారు.

ఇదే సమయంలో పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయంలో కావాలని, త్వరలో పూర్తి వివరాలు కోర్టుకు సమర్పిస్తామని హైకోర్టుకు మనవి చేశారు. పోలీసుల తరపున న్యాయవాది చేసిన మనవికి అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై జారీ చేసిన ఎల్ఓసీని కోర్టు ముందు ఉంచాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తనపై కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా తనను పోలీసులు వేధించారని, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని, కోర్టు దిక్కరణ కింద వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి మరో పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశారు. పిటీషన్ విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వహోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐకి నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద నాలుగు వారాల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చెయ్యడంతో సజ్జల ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications