తిరుపతిలో మహా ఉత్సవం..!!
TTD:తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రానుండటంతో దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజున చిన్నశేష వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. 29న పెదశేష వాహనం, హంసవాహనం, 30న ముత్యాలపందిరి, సింహ వాహనం, డిసెంబర్ 1న కల్పవృక్ష వాహనం, హనుమద్వాహన సేవలు జరుగుతాయి.

2న పల్లకి ఉత్సవం, గజవాహనం, 3వ తేదీన బంగారు రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపై దర్శనం ఇస్తారు. 4న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తారు. 5వ తేదీన రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం అశ్వవాహనం, 6న తిరుచ్చి ఉత్సవం, పంచమీ తీర్థాన్ని జరుపుతారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుచానూరుకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తోన్నారు.
చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర పనులు దాదాపుగా ముగింపుదశకు వచ్చాయి. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. తెల్లవారు జామున సుప్రభాతంతో శ్రీ పద్మావతి అమ్మవారిని మేల్కొలుపుతారు. సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు అర్చకులు, టీటీడీ అధికారులు.
ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications